ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్‌ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.
అక్కడ ఏం జరుగుతోంది?
ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్‌లో తిరుగుతాయి. మరో లేన్‌లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.
2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది.
The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf
— Chris Kost (@chriskost) May 10, 2026
మోదీ సూచనతో కంపేర్ చేస్తే..
జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


