గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది

London walls get repellent paint to prevent public urination - Sakshi

బహిరంగ ప్రదేశాల్లో పని కానిచ్చే వారికి లండన్‌ యంత్రాంగం విరుగుడు

లండన్‌: బహిరంగ మూత్ర విసర్జన ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న దురలవాటు. దీని కారణంగా పరిసరాలు దుర్గంధంతో నిండి అందరూ ఇబ్బందులు పడుతున్నారు. లండన్‌ యంత్రాంగం దీనికి ఓ విరుగుడును కనిపెట్టింది. గోడలపై పోసే మూత్రం చింది తిరిగి వారిపైనే పడితే..? ఆ పాడు పనిని మానుకుంటారేమో. పారదర్శక వాటర్‌ రిపెల్లెంట్‌ రసాయనాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే పోసిన వ్యక్తి పైకే మూత్రం చింది పడుతుంది. దుస్తులు తడిచిపోతాయి. వారికి ఇదే తగిన శిక్ష అవుతుంది. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ సిటీ కౌన్సిల్‌ ఇందుకోసం సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది. సోహోలో 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర వినోద ప్రాంతాలతోపాటు నివాస ప్రాంతాలూ ఉన్నాయి.

సుమారు 0.6 చదరపు కిలోమీటర్‌ విస్తీర్ణంలోని సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. పబ్లిక్‌ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్‌ యంత్రాంగం ఏటా రూ.10.26 కోట్లు వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు (దిస్‌ వాల్‌ ఈజ్‌ నాట్‌ ఫర్‌ యూరినల్‌) అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే ప్రయోగాన్ని మరో ప్రాంతంతోపాటు జర్మనీలోనూ ప్రయోగాత్మకంగా చేసి, మంచి ఫలితం సాధించారు. ఆరునెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని స్థానిక అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top