‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్‌పైకి.. | Iran writes 'Thank You India' on fresh wave of missiles launched at Israel | Sakshi
Sakshi News home page

‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. ఇజ్రాయెల్‌పైకి..

Mar 27 2026 8:00 PM | Updated on Mar 27 2026 8:17 PM

Iran writes 'Thank You India' on fresh wave of missiles launched at Israel

టెహ్రాన్‌: ‘థ్యాంక్యూ ఇండియా’ అని మిసైళ్లపై రాసి.. వాటిని ఇజ్రాయెల్‌పైకి వదిలింది ఇరాన్‌. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్‌ మీడియా ప్రెస్‌ టీవీతో పాటు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ పోస్ట్‌ చేశాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది క్షిపణులపై బ్లూ మార్కర్లతో “భారత ప్రజలకు ధన్యవాదాలు” వంటి వాక్యాలు రాస్తున్నట్లు కనిపించింది. స్పెయిన్, పాకిస్థాన్, జర్మనీ ప్రజలకు కూడా థ్యాంక్స్‌ చెబుతూ ఇలాంటి సందేశాలే రాసినట్లు సమాచారం. ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న దేశాలకు కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నంగా ఇది కనిపిస్తోంది.

దీన్ని “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4”లో భాగంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జరిపిన చర్యగా ఇరాన్ నెట్‌వర్క్ ప్రెస్ టీవీ తెలిపింది. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక లక్ష్యాలపై దాడులు చేశామని ఐఆర్జీసీ తెలిపింది. ఇందులో అష్డోడ్‌లోని ఆయిల్ నిల్వ కేంద్రాలు, మోడీన్ సమీపంలోని సైనిక స్థావరాలు, అమెరికా సైనిక సమాచార మార్పిడి కేంద్రం ఉన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.

అల్-ధఫ్రా, అల్-ఉదైరి ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలు, అలాగే అలీ అల్-సలేం ఎయిర్ బేస్, షేఖ్ ఈసా బేస్‌లపై దాడులు జరిగాయని పేర్కొంది. ఇరాన్, దీర్ఘ శ్రేణి, మధ్య శ్రేణి క్షిపణులు, డ్రోన్లను వినియోగించిందని, ఆపరేషన్ విజయవంతమైందని తెలిపింది.

భారత్‌కు ఎందుకు థ్యాంక్స్‌ చెప్పారు?
భారత్-ఇరాన్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. యుద్ధం వేళ ఇరాన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరాన్ తాజాగా, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధి ద్వారా భారత నౌకలకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో, అమెరికా, దాని మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఇరాన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భారత్‌ను స్నేహపూర్వక దేశంగా పేర్కొని, యుద్ధ పరిస్థితుల్లో కూడా భారత నౌకలను అడ్డుకోబోమని చెప్పారు.

మరొక కారణం ఏంటంటే, భారత ప్రజల నుంచి ఇరాన్‌కు మానవతా సాయం అందింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతం నుంచి. జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లోని ప్రజలు ఇరాన్‌కు సాయం అందించేందుకు విరాళాల సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. నగదు, ఆభరణాలు, గృహ సంబంధిత వస్తువులు వంటి సాయం అందించారు. ఒక కశ్మీరీ మహిళ తన భర్త జ్ఞాపకంగా దాదాపు 3 దశాబ్దాలుగా దాచుకున్న బంగారాన్ని ఇచ్చేసింది. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ చర్యలను గుర్తించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సాయం ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement