ఇండోనేషియా: వివాహానికి ముందే శృంగారమా?.. ఇలాంటి శిక్ష తప్పదు!

Indonesia set to make premarital sex punishable - Sakshi

జకార్తా: చాలా దేశాల్లో డేటింగ్‌, పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం లాంటి వ్యవహారాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే.. ఇస్లాం దేశమైన ఇండోనేషియా.. అలాంటివి సహించడం కుదరని అంటోంది. వివాహానికి ముందే శృంగారాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించుకుంది. 

తాజాగా ఇండోనేషియా కొత్త క్రిమినల్‌ కోడ్‌ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటే శిక్షించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ క్రిమినల్‌ కోడ్‌ను త్వరలో జరగోబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుందట.  వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నా.. లేకుంటే వివాహేతర సంబంధం కొనసాగించినా?.. ఏడాదిపాటు కారాగార శిక్ష విధించాలని, అదే విధంగా జరిమానా కూడా విధించాలని సదరు డ్రాఫ్ట్‌ పేర్కొంది.

అయితే.. ఇది అమలు కావాలంటే ఒకటి వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త.. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. అలాగే.. వివాహం కాకముందు శృంగారంలో గనుక పాల్గొంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్‌ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభం కాకముందు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ఈ డ్రాఫ్ట్‌ వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ప్రజావ్యతిరేకతతో ఇంతకాలం ఇది అమలుకు నోచుకోలేదు. 

ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా ఉన్న ఇండోనేషియాలో.. మహిళలను, మైనారిటీలను, ఎల్జీబీటీక్యూలను అణగదొక్కేందుకు వందల సంఖ్యలో నియంత్రణ చట్టాలు అమలు అవుతున్నాయి. ఇక కొత్తగా రాబోయే క్రిమినల్‌ కోడ్‌.. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా వర్తించనుంది. అయితే ఇది టూరిజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top