విమానం కూలిన చోటు గుర్తించాం

Indonesia locates black boxes of crashed jet as body parts recovered - Sakshi

విమాన ప్రమాదంపై ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటన

గల్లంతైన ప్రయాణికుల కోసం కొనసాగుతున్న అన్వేషణ

మృతుల కుటుంబాలకు భారత ప్రధాని మోదీ సంతాపం  

జకార్తా: ఇండోనేసియాలో 62 మందితో కనిపించకుండా పోయిన విమానం జావా సముద్రంలో కూలిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు ఎంతో కీలకమైన బ్లాక్‌బాక్స్‌ ఉన్న చోటును కూడా గుర్తించినట్లు పేర్కొంది. ఘటనపై ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేసియా పౌరులు, ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. బాధిత కుటుంబాలకు భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు.

ఈ విషాద సమయంలో ఇండోనేసియాకు భారత్‌ తోడుగా నిలుస్తుందన్నారు. ప్రమాదానికి గురైన బోయింగ్‌ విమానం గతంలో అమెరికా విమానయాన సంస్థలు వాడిందేనని శ్రీవిజయ ఎయిర్‌ ప్రెసిడెంట్‌ డైరెక్టర్‌ జెఫర్సన్‌ ఇర్విన్‌ జవెనా అన్నారు. 26 ఏళ్ల క్రితం తయారైన ఈ విమానం ఫూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని తెలిపారు. శనివారం విమానం జకార్తా నుంచి గంట ఆలస్యంగా బయలుదేరడానికి వాతావరణం సరిగా లేకపోవడమే కారణమని వివరించారు. విషాద ఘటనపై ఇండోనేసియా అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్‌ బగుస్‌ పురుహితో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘విమానం నుంచి ఆఖరు సారిగా నమోదైన సిగ్నల్‌ ఆధారంగా ప్రమాద ప్రాంతాన్ని గుర్తించాము.

బ్లాక్‌బాక్స్‌లుగా పిలిచే ఫ్లైట్‌ డేటా రికార్డర్, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ల నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సిగ్నళ్లను నౌకాదళం కనుగొంది. వీటి ఆధారంగా సముద్ర జలాల్లో అవి ఏ ప్రాంతంలో ఉన్నాయో గుర్తించాం’అని వివరించారు. అతి త్వరలోనే వాటిని వెలికితీసి, ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలుసుకుంటామని మిలటరీ చీఫ్‌ హదీ టిజాజంతో అన్నారు. ఆదివారం సముద్ర జలాల్లో 75 అడుగుల లోతులో రిజిస్ట్రేషన్‌ నంబర్‌ తదితర వివరాలతో కూడిన ప్రధాన విమాన భాగాలను వెలికితీశామన్నారు.  శ్రీ విజయ ఎయిర్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి పొంటియానక్‌ వైపు బయలుదేరింది. నాలుగు నిమిషాలకే కంట్రోల్‌ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top