స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ విజేత శ్రేయ్‌ పారిఖ్‌  | Indian-Origin Shrey Parikh Is New US Spelling Bee Champion | Sakshi
Sakshi News home page

స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ విజేత శ్రేయ్‌ పారిఖ్‌ 

May 30 2026 4:23 AM | Updated on May 30 2026 4:23 AM

Indian-Origin Shrey Parikh Is New US Spelling Bee Champion

రెండో స్థానంలో ఇషాన్‌ గుప్తా, మూడో స్థానంలో సర్వ్‌ ధరవణే  

ప్రతిష్టాత్మక పోటీలో భారతీయ సంతతి విద్యార్థుల ఘనత  

వాషింగ్టన్‌:  అమెరికాలో ప్రతిష్టాత్మక స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలో 14 ఏళ్ల భారతీయ అమెరికన్‌ విద్యార్థి శ్రేయ్‌ పారిఖ్‌ విజేతగా నిలిచాడు. 35 పదాలకు గాను 32 పదాల అక్షరక్రమాన్ని కేవలం 90 సెకెండ్లలో సరిగ్గా చెప్పి ఆశ్చర్యపర్చాడు. శుక్రవారం వాషింగ్టన్‌లో ఈ పోటీ జరిగింది. శ్రేయ్‌ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తోంది. డే క్రీక్‌ ఇంటరీ్మడియెట్‌ స్కూల్‌లో ఎనిమిదో గ్రేడ్‌ చదువుతున్నాడు. 

బ్రోమోక్రిప్టైన్‌ అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పడం ద్వారా 12 ఏళ్ల ఇషాన్‌ గుప్తాను ఓడించి, విజయం సొంతం చేసుకున్నాడు. న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో ఏడో గ్రేడ్‌ చదువుతున్న ఇషాన్‌ గుప్తా రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 12 ఏళ్ల సర్వ్‌ ధరవణే మూడో స్థానంలో నిలిచాడు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు భారత సంతతికి చెందినవారే. 

అగ్రస్థానంలో నిలిచిన శ్రేయ్‌ పారిఖ్‌కు 50,000 డాలర్ల నగదు బహుమతి, స్మారక్‌ పతకం, స్క్రిప్స్‌ కప్, మెరియం–వెబ్‌స్టర్‌ డిక్షనరీ నుంచి 2,500 డాలర్లు, డెల్టా సంస్థ నుంచి 1,000 డాలర్ల ఫ్లైట్‌ క్రెడిట్స్, ఎన్‌సైక్లోపిడియా బ్రిటానికా నుంచి 400 డాలర్లు బహుమతిగా లభించాయి. ఇషాన్‌ గుప్తాకు 25,000 నగదు, సర్వ్‌ ధరవణేకు 15,000 డాలర్ల నగదు బహుమతిగా దక్కింది. 

90 సెకండ్లలో వీలైనన్ని ఎక్కువ ఆంగ్ల పదాలకు అక్షరక్రమం సరిగ్గా చెప్పినవారే విజేతగా నిలుస్తారు. 2024లో బృహత్‌ సోమ అనే విద్యార్థి సృష్టించిన రికార్డును శ్రేయ్‌ పారిఖ్‌ అధిగమించాడు. బృహత్‌ సోమ 90 సెకండ్లలో 30 పదాలకు గాను 29 పదాలకు సరైన స్పెల్లింగ్‌ చెప్పాడు. ప్రతిరోజూ వేగంగా స్పెల్లింగ్‌ సాధన చేస్తుంటానని శ్రేయ్‌ పారిఖ్‌ తెలియజేశాడు.  

భారతదేశం అంటే చాలా ఇష్టం  
స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ మూడు రోజులపాటు జరిగింది. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతోపాటు బహమాస్, కెనడా, ఘన, నైజీరియా, యూఏఈ తదితర దేశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. మొత్తం 247 మంద పోటీపడ్డారు. 9 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. శ్రేయ్‌ పారిఖ్‌ 2022లో స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీలో 89వ స్థానం, 2024లో మూడోస్థానంలో నిలిచాడు. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. టెన్నిస్, చెస్‌తోపాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. 

గణిత శాస్త్రంలో ప్రతిభ చూపుతున్నాడు. గణిత పోటీల్లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తన అమ్మమ్మ తాతయ్య, బంధువులు ఉన్న భారత్‌ అంటే చాలా ఇష్టం. సెలవుల్లో భారత్‌కు వెళ్తుంటాడు. ఎప్పుడైన ఖాళీ టైమ్‌ దొరికితే కొత్తకొత్త లెక్కలు సాధన చేస్తుంటాడు. పుస్తకాలు బాగా చదువుతాడు. సమయం వృథా చేయడం ఇష్టం ఉండదని చెబుతున్నాడు.

భారత మూలాలున్న విద్యార్థుల హవా  
ఇక స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ పోటీకి పెద్ద చరిత్రే ఉంది. 1925లో మొదటి కాంపిటీషన్‌ జరిగింది. ఇందులో పాల్గొనాలంటే 15 ఏళ్ల వయసు మించకూడదు. ఎనిమిదో గ్రేడ్‌ లోపే చదువుతూ ఉండాలి. స్క్రిప్స్‌ స్పెల్లింగ్‌ బీ కాంపిటీషన్‌లో నెగ్గిన తొలి భారతీయ అమెరికన్‌ విద్యార్థిగా బాలు నటరాజన్‌ రికార్డు సృష్టించాడు. 1985లో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలో ముఖ్యంగా భారతీయ అమెరికన్‌ విద్యార్థులే పైచేయి సాధిస్తుండడం విశేషం. ఈ ఏడాది ఫైనల్‌కు చేరిన తొమ్మిది మందిలో ఐదుగురు భారత సంతతి విద్యార్థులే కావడం గమనార్హం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement