
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌ల భారం మోపడంతో వాటిని తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో అమెరికా అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందంతో వాణిజ్య చర్చలు జరపనుంది. ఈ వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సోమవారం వెల్లడించారు.
భారతీయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరకుల ఎగుమతులు ఆగస్ట్‌లో తొమ్మిది నెలల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలుకానుండటం గమనార్హం. భారత్, అమెరికా వాణిజ్యచర్చల అంశాన్ని సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో నవరో వెల్లడించారు. భేటీ కచి్చతంగా జరగనుందని భారత్ తరఫున చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశ వాణిజ్యమంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ సైతం చెప్పారు.
అమెరికా మధ్య, దక్షిణాసియా వ్యవహారాల వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ సైతం ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ‘‘ భారత్ ఎప్పటికైనా అమెరికాతో వాణిజ్య చర్చలపై తుది నిర్ణయం తీసుకోక తప్పదు. లేదంటే వాణిజ్యం అనేది సవ్యంగా సాగదు. టారిఫ్‌ల విషయంలో భారత్ మహారాజు వంటిదే. మా సరకులపై అత్యధిక సుంకాలు మోపుతుంది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు వరకు రష్యా నుంచి భారత్ కొనుగోలుచేసిన ముడి చమురు పరిమాణం చాలా అత్యల్పం. కొన్ని చుక్కల ఆయిల్ మాత్రమే కొన్నదేమో.
ఇప్పుడేమో భారీఎత్తున కొనగోలుచేస్తూ భారత్ లాభాలను కొల్లగొడుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీ సంస్థలు సైతం భారత్‌కు చమురు అమ్మేసి లాభాల పంట పండిస్తున్నారు. ఈ లాభాలతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు సాయపడేందుకు అమెరికా పెద్ద ఎత్తున సొంత ఖజానా కరెన్సీని ఖర్చుచేస్తోంది. అలా అమెరికన్లు పన్నుల రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించిన మొత్తాలన్నీ ఉక్రెయిన్ యుద్ధం కోసం వృథా అవుతున్నాయి’’ అని భారత్‌ను పరోక్షంగా నవరో విమర్శించారు.
