రూపాయి విలువ పతనంతో పెరిగిన ఖర్చులు, ఫీజులు
ఖర్చులు తగ్గించుకోవడానికి కడుపు మాడ్చుకుంటున్న విద్యార్థులు
ఇరుకు గదుల్లో జీవితం, ఎంత దూరమైనా నడకే
పార్ట్‌టైమ్ ఉద్యోగాలతోపాటు అదనపు పనులు
రూపాయి విలువ పతనం.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు శాపంగా మారింది. ఒక్కపూట తింటూ అర్థాకలితో బతుకుతున్నారు. తక్కువ ధరలో దొరుకుతుందని
కొందరు కాలం చెల్లిన ఆహారం కోసం వెతుకుతున్నారు. డబ్బులు సరిపోక అదనపు పనులు చేస్తున్నారు. ఇదంతా వారి చదువులపై ప్రభావం చూపి విద్యార్థుల గ్రేడ్లు దెబ్బతింటున్నాయి.
భారత రూపాయి ఇప్పుడు అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కొన్ని నెలల్లోనే తీవ్రమైంది. డాలర్‌కు రూపాయి విలువ 95 మార్కును దాటింది. ఏ క్షణంలోనైనా అది 100 చేరుకునే అవకాశం ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు పౌండ్‌తో పోలిస్తే రూపాయి బలహీనంగా కనిపించేది. 2013లో పౌండ్‌తో రూపాయి విలువ మూడంకెల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2022లో, యూరోతో పోలిస్తే రూపాయి 100 మార్కును తాకింది. ఇప్పుడు, డాలర్ విలువ 100 రూపాయలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కడుపు మాడ్చుకుంటూ
విదేశాల్లో చదువు అంటే తాము ఊహించుకున్న జీవితం వేరు.. కానీ అక్కడ గడుపుతున్న జీవితం మరోలా ఉంది. బలహీనపడుతున్న రూపాయి, విదేశాల్లోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప.. మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కొందరు అసలు భోజనమే మానేయాల్సి వస్తోంది. మరికొందరు రోజుకు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు.
యూకే, యూఎస్, ఆ్రస్టేలియా, సింగపూర్‌లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. బయట తినడం మొత్తమే మానేస్తున్నారు. తక్కువ ధర ఉన్న ఆహారం కోసం ‘టూ గుడ్ టు గో’వంటి యాప్‌లపై ఆధారపడుతున్నారు. ఈ యాప్‌లు కోస్టా కాఫీ, స్టార్‌బక్స్ వంటి ఫుడ్ అవుట్‌లెట్లలో గడువు ముగియబోతున్న ఆహార వివరాలను పెడతాయి. ఆ లిస్టింగ్ లైవ్‌లోకి వచ్చిన వెంటనే క్షణాల్లో అయిపోతోంది. వేరోవరో బుక్ చేసుకుని అది చేజారిపోకుండా ఉండేందుకు విద్యార్థులు స్టోర్‌కు పరుగెడుతున్నారు. అదీ దొరక్కపోతే ఆకలితో అలమటించాల్సిందే.
వర్సిటీ ఆహార పంపిణీపై
అమెరికాలోని చాలా మంది విద్యార్థులు డబ్బు ఆదా చేసుకోవడానికి విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆహార పంపిణీపై ఆధారపడుతున్నారు. చాలా విశ్వవిద్యాలయాలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తాయి. బయట తినే ఖర్చులను తగ్గించుకోవడానికి విద్యార్థులు ఆ సామాగ్రిని తమ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కిరాణా సామగ్రిని సైతం కలిసి కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లను షేర్ చేసుకుంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఏడెనిమిది మంది విద్యార్థులు ఒకే గదిలో లేదా అపార్ట్‌మెంట్‌లో ఇరుక్కుని ఉంటున్నారు.
అదనపు పని
చాలా మంది విద్యార్థులు తమకు అధికారికంగా అనుమతి ఉన్న పని గంటలకు మించి పనిచేస్తున్నారు. అధికారిక పార్ట్‌టైమ్ ఉద్యోగాలతోపాటు డిపార్ట్‌మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో నేల తుడవడం వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేస్తున్నారు. పౌండ్ బలపడుతున్న కొద్దీ యూకేలోని చిన్న విశ్వవిద్యాలయ పట్టణాల్లోనూ రోజువా రీ జీవితం మరింత ఖరీదైనదిగా మారింది. క్యాబ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజా రవాణా కూడా ఖరీదైనదిగా మారింది. దీంతో డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది.
భారత్‌లోని కుటుంబాలపై భారం...
ఇది కేవలం విదేశాల్లోని విద్యార్థులనే కాదు.. భారత్ నుంచి వారి చదువుకు డబ్బు పంపుతున్న కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ కరెన్సీ పతనం మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయిస్తారు. ట్యూషన్ ఫీజులు, అద్దె, రానుపోను విమాన ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులను లెక్కిస్తారు. ఈ క్రమంలో కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం కరెన్సీ విలువ తగ్గడం ఫీజుల పెంపుదలలా పనిచేస్తోంది. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు సెమిస్టర్ వారీగా ఫీజులు వసూలు చేస్తాయి.
రూపాయి విలువ పడిపోవడంతో చివరి సెమిస్టర్ల నాటికి అప్పటికే తీసుకున్న విద్యా రుణం సరిపోవడం లేదు. విద్యార్థుల ఖర్చులు పెరగడంతో మిగిలిన ఫీజులను భరించడానికి వారి తల్లిదండ్రులు అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఒకే డిగ్రీ కోసం రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక కోర్సులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రూపాయి–డాలర్ మారకపు రేటులో చిన్నపాటి తగ్గుదల కూడా నాలుగైదేళ్లలో అదనంగా పెరిగే లక్షల రూపాయలను అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
గ్రేడ్‌లపై ప్రభావం..
భారతీయ విద్యార్థుల కష్టాలు వారి గ్రేడ్‌లలో ప్రతిబింబిస్తున్నాయి. డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు భోజనం మానేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు ఒకే గదిలో ఇరుక్కుని ఉంటున్నారు. నిరంతరం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో వారు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల గురించే కాకుండా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. వలస, పని వీసాల నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడంతో హెచ్–1బీ వీసా వ్యవస్థ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌పై అనిశ్చితి ఏర్పడింది. భవిష్యత్ గందరగోళంగా మారింది.
డిస్కౌంట్‌లో దొరికిన ఆహారం తినే...
‘‘విదేశాల్లో చదువుకునే వారందరూ సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కాదు. స్కాలర్‌షిప్‌లపై చదువుకుంటున్న వారున్నారు. పిల్లల డిగ్రీల కోసం ఇళ్లను తాకట్టు పెట్టిన తల్లిదండ్రులూ ఉన్నారు. నా మాస్టర్స్ కోసం బడ్జెట్ వేసుకునేటప్పుడు రూపాయి అంశాన్ని నేను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ నేను లండన్ వెళ్లాక అర్థమైంది. అప్పుడు అమెరికన్ డాలర్ విలువ రూ.85 ఉంది. నేను తిరిగొచ్చేసరికి రూ. 93కి పెరిగింది. లండన్‌లో నేను చాలాసార్లు యాప్‌ల్లో డిస్కౌంట్‌లో దొరికిన ఆహారం తెచ్చుకునే కడుపు నింపుకున్నాను. యూకేలో ఉన్నా, అమెరికాలో చదువుతున్నా.. ఇంటి నుంచి పంపిన డబ్బును సరిపోయేలా వాడుకోవాలనే ఆందోళన ఉంటుంది. ఇది విద్యార్థుల గ్రేడ్లపై ప్రభావం చూపిస్తుంది’’అని యూకేలో చదువుకొని వచ్చిన థానేకు చెందిన మాన్వి కోలి చెబుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


