17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు

Homeless High School Dropout Became CEO For A Company - Sakshi

తైహీ కొబయాషి... జపాన్‌ యువతకు ఆదర్శం. పాఠశాలకు డ్రాపౌట్‌ అయిన కారణంగా తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో బయటకు వచ్చిన అతడు.. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఓ స్టార్టప్‌ను స్థాపించాడు. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 1 బిలియన్‌ డాలర్లు. టోక్యో వీధుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ అనాధలా బతికిన నాటి నుంచి నేడు సంపన్న వ్యక్తిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం.

చిన్నప్పటి నుంచి కొబయాషికి సంగీతం అంటే ప్రాణం. మ్యూజిక్‌ నేర్చుకునేందుకు స్కూలు ఎగ్గొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా చదువును నిర్లక్ష్యం చేసిన కొబయాషి.. హైస్కూళ్లోనే డ్రాపౌట్‌ అయ్యాడు. ఉన్నత విద్యనభ్యసించి కొడుకు ప్రయోజకుడైతే చూడాలనుకున్న అతడి తల్లిదండ్రులు కొబయాషి తీరుతో ఎంతో బాధపడ్డారు. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకుని అతడి చదువు కోసం పొదుపు చేసిన డబ్బుకు విలువ లేకుండా పోయిందని, కొబయాషి ఇకపై బాగుపడడు అనే బాధ వారిని వెంటాడింది. ఆ కోపంలోనే అతన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అలా 17 ఏళ్ల వయస్సులో కొబయాషి ఇల్లు విడిచాడు.

టోక్యోలోని వీధులే అతడికి ఆశ్రయమిచ్చాయి. వానకు తడవడం, చలికి వణికకడం అతడికి అలవాటుగా మారాయి. అప్పుడు కార్డుబోర్డులే అతడికి దుప్పట్లు అయ్యాయి. అలా ఏడాదిన్నర పాటు ఏ దిక్కు లేక కాలం వెళ్లదీశాడు కొబయాషి. అయినప్పటికీ, సంగీతాన్ని మాత్రం వదల్లేదు. అలాంటి సమయంలో కొబయాషిలోని ప్రతిభను గుర్తించిన ఓ లైవ్‌ మ్యూజిక్‌ క్లబ్‌ మేనేజర్‌ అతడికి పిలిచి మరీ ఉద్యోగమిచ్చాడు. ఆరేళ్లపాటు కోబయాషి అక్కడే పనిచేశాడు. కానీ అదొక్కటే జీవితం కాదని అతనికి అర్థమైంది. సంగీతంతో ఒక్కటే కాదని, మంచి ఉద్యోగం అవసరమని నిర్ణయించుకున్నాడు. కోరుకున్నఉద్యోగం దొరికేంత వరకు నిలదొక్కుకోవడానికి ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ రికార్డులతో కొంత డబ్బు పోగు చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రకటనల వేట మొదలుపెట్టాడు. అలా 2012లో వియత్నాం చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతడికి ఓ సువర్ణావకాశం వచ్చింది. ఎటువంటి అకడమిక్‌ అర్హతల అవసరం లేకుండానే ఓ కంపెనీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందే వెసులుబాటు కల్పించింది.

అందుకోసం ఆరు గంటల పరీక్ష.. మాథమెటికల్‌ స్కిల్స్‌తో పాటు లాజికల్‌ థింకింగ్‌, ఐక్యూ టెస్టు నిర్వహించగా.. కొబయాషి అన్నింటిలో పాసయ్యాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం. కానీ కొబయాషి ఆ ఉద్యోగంతోనే సరిపెట్టుకోలేదు.‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు చాలా మందే ఉంటారు. కానీ సరికొత్త బిజినెస్‌ మోడల్స్‌తో ముందుకు వెళ్లేవారు చాలా అరుదుగా ఉంటారనే ఆలోచనే అతనితో ఓ స్టార్టప్‌ స్థాపనకు దారి తీసింది. అక్కడే పనిచేసే మకాటో హిరాయి కూడా కొబయాషికి జతయ్యాడు. వారితో పాటు మరికొంత మంది. అంతాకలిసి 2013 మార్చిలో ఫ్రామ్గియా ఇన్‌కార్పొరేషన్‌ పేరిట స్టార్టప్‌ స్థాపించారు. తర్వాత దాని పేరును  సన్‌ అస్టెరిస్క్‌గా మార్చారు.

వియత్నాంలోని యువతకు పెద్దపీట వేశారు. స్టార్టప్‌లకు ఐడియాలు ఇవ్వడం, ఇప్పటికే నిలదొక్కుకున్న కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగేలా చేయడం లక్ష్యంగా ఈ కంపెనీని స్థాపించారు. అందులో విజయవంతమయ్యారు. 70కి పైగా క్లైంట్లు ఉన్నారు. టోక్యో స్టాక్‌ ఎక్స్చేంజీలో కొబయాషీ కంపెనీ లిస్ట్‌ అయ్యింది. సెప్టెంబరు నాటికి దాని మార్కెట్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. అయితే ఆ తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఎదురుకావడంతో ఇప్పుడు దాని విలువ 1 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఆ కంపెనీలో కొబయాషి వాటా 7.9 శాతం. విలువ 71 మిలియన్‌ డాలర్లు. ఇప్పుడు తనే ఆ కంపెనీ సీఈఓ. ఇప్పుడు అతని వయస్సు 37 ఏళ్లు.

అలా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత కొబయాషి 2019లో జపాన్‌కు చేరుకున్నాడు. అక్కడా తమ కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు టోక్యో ఆఫీసులో 130 మంది ఉద్యోగులు, వియత్నాంలో 1300 ఉద్యోగులు ఉన్నారు. అతడి స్ఫూర్తితో ఇప్పుడు జపాన్‌లో చాలా మంది స్టార్టప్‌లు పెడుతున్నారు. ఇక బిజినెస్‌మెన్‌గా సక్సెస్‌ అయిన కొబయాషి తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కొబయాషి జీవితంలో అది పెద్దలోటు. ‘‘నాకప్పుడు అంతా నరకంలా అనిపించేది. కానీ వాటిని నేను అధిగమించాను. డ్రాపౌట్‌ అయిన నన్ను ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నారు నా తల్లిదండ్రులు. నేను ఇల్లు వీడాను.. అంతే. నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే చేశాను. టోక్యోలోని షింజుకు, శిబుయా జిల్లాలోని వీధుల్లో గడిపాను. నిజానికి ఆ చలికి నేను చచ్చిపోయేవాడినే. ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రించేవాడిని’’అని కొబయాషి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. 

అయితే ప్రతీసారీ అదృష్టం కలిసిరాదని, షేర్‌ మార్కెట్లో ఎత్తుపల్లాలు సహజం కాబట్టి అంతగా ఆనంద పడాల్సిన అవసరం లేదంటూ వ్యాపార ప్రత్యర్థులు హెచ్చరించినా తాను జీవితంలో ఇప్పటికే అతిపెద్ద కష్టాలు దాటి వచ్చానని, ఓటమి గురించి తానెప్పుడూ భయపడనని కొబయాషి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. తన కంపెనీని టాప్‌లో నిలబెట్టడమే లక్ష్యమని అందుకోసం ఎంతకైనా శ్రమిస్తానని చెప్పుకొచ్చాడు. రిస్కు చేయడంలోనే అసలైన మజా ఉందని పేర్కొన్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top