
న్యూఢిల్లీ: 30 ఏళ్ల క్రితం హర్జిత్ కౌర్ భారత్ నుంచి తన ఇద్దరు కుమారులతో పాటు అమెరికాకు వెళ్లినప్పుడు.. ఇలాంటి రోజు వస్తుందని ఊహించనేలేదు. పంజాబ్‌కు చెందిన హర్జిత్ కౌర్.. కాలిఫోర్నియాలో ఎటువంటి పత్రాలు లేని వలసదారుగా ఇన్నాళ్లూ ఉన్నారు. అయితే ఆమె అమెరికాలో పనిచేస్తూ, తగిన రీతిలో పన్నులు చెల్లించారు. చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి అధికారుల ముందు హాజరయ్యారు. ఇప్పుడు 73 ఏళ్ల హర్జిత్ కౌర్‌కు అమెరికా అధికారులు సంకెళ్లు వేసి, ఆహారం, మందులు అందించకుండా సుదీర్ఘ నిర్బంధం విధించాక భారత్‌కు పంపారు.
రెండు గంటలు వెయిటింగ్‌లో పెట్టి..
అమెరికాలో మూడు దశాబ్దాలుగా ఉన్న ఆమె తాను కుటుంబం నుండి వేరుపడుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఆకస్మిక బహిష్కరణ వెనుక గల కారణం ఆమెకు తెలియకపోయినా, ట్రంప్ సర్కారు వలసదారులపై సాగిస్తున్న అణిచివేతనే దీనికి కారణమని భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు తన చేతికి సంకెళ్లు వేసి, అరెస్టు చేయడాన్ని గుర్తు చేసుకుంటూ..‘నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నా హాజరు నమోదు చేసుకున్నాను. సెప్టెంబర్ 8న నేను ఆ కేంద్రానికి వెళ్ళినప్పుడు, వారు నన్ను రెండు గంటల పాటు వేచి ఉండేలా చేశారు. తరువాత వారు ఒక కాగితంపై సంతకం చేయమని అడిగారు. నా తరపు న్యాయవాది లేకుండా నేను సంతకం చేయడానికి నిరాకరించాను. అయితే అధికారులు నా వేలిముద్రలు ఉన్నాయని చెప్పారు. నన్ను అరెస్టు చేయనున్నారని తెలిపారు. అయితే దీనికి ఎటువంటి కారణం చెప్పలేదు’ అంటూ హర్జిత్ కౌర్ మీడియా ముందు రోదించారు.
ఖైదీలకు ఇచ్చిన యూనిఫాంలో..
ట్రంప్ సర్కారు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 2,400 మంది భారతీయులను బహిష్కరించింది. వారిలో కౌర్ కూడా ఉన్నారు. ఆమె రెండు రోజుల క్రితం భారతదేశానికి ఖైదీలకు ఇచ్చిన యూనిఫాంలో వచ్చారు. తాను ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ ఆమె విలపించారు. ‘నా మనుమడు ఈ దుస్తులలో నేను నిన్ను చూడలేకపోతున్నానని చెప్పాడని కౌర్ గుర్తు చేసుకున్నారు. ‘వారు నాకు మందులు ఇవ్వలేదు. నేను నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయాను. నాకు ప్రశాంతత కరువయ్యింది. పాదాలు వాచిపోయాయి. శరీరమంతా నొప్పిగా ఉంది. నేను రాత్రంతా కూర్చోలేకపోయాను. పంజాబ్‌కు చెందిన ఒక అమ్మాయి నన్ను పడుకోవాలని చెప్పింది. నేను అంగీకరించాను, అయితే మర్నాటి ఉదయం నేను లేవలేకపోయాను’ అని కౌర్ తెలిపింది.
శాకాహారి కౌర్‌కు మాంసాహారం ఇచ్చి..
నిర్బంధ కేంద్రంలో ఆమెకు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆమె తరపు న్యాయవాది దీపక్ అహ్లువాలియా ఆరోపించారు. కౌర్ నేలపైనే పడుకుంది. స్నానం చేయడానికి అనుమతినివ్వలేదు. కమర్షియల్ ప్యాసింజర్ జెట్‌కు బదులుగా చిన్న, చార్టర్డ్ విమానంలో ఆమెను తరలించారని అహ్లువాలియా ఆరోపించారు. శాకాహారి అయిన కౌర్‌కు మాంసాహారం ఇచారు. దానిని ఆమె తికపోవడంతో గట్టి బ్రెడ్ ఇచ్చారు. అది కూడా తినలేక బిస్కెట్లు తింటూనే కౌర్ కాలం గడిపారన్నారు. కౌర్ తన భర్త మరణానంతరం 1992లో అమెరికాకు వెళ్లారు. ఇద్దరు కుమారులతో ఉత్తర కాలిఫోర్నియాలోని తూర్పు బేలో ఉన్నారు.