క్రూయిజ్‌షిప్ నుంచి ముగ్గురు బాధితుల తరలింపు
నడి సముద్రంలో 150 మంది ప్రాణాలు
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న డబ్ల్యూహెచ్‌వో
జోహన్నెస్‌బర్గ్: అట్లాంటిక్ సముద్రంలో చిక్కుకున్న ‘ఎంవీ హోండియస్’క్రూయిజ్ నౌక నుండి ముగ్గురు వ్యాధి అనుమానిత రోగులను సురక్షితంగా తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ రోగులను నెదర్లాండ్స్‌కు తరలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ బుధవారం ధ్రువీకరించారు. అర్జెంటీనాలో ఏప్రిల్ 1న బయలుదేరిన ఈ నౌకలో ఇప్పటికే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అనారోగ్యానికి గురవడం తెలిసిందే. క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రయాణికులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజారోగ్యానికి ముప్పు తక్కువగానే ఉందని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో స్పష్టం చేశారు.
విషాద స్థావరంగా విలాస నౌక
అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో కేప్ వర్డే తీరానికి చేరువలో, ‘ఎంవీ హొండియస్’అనే నౌక ఇప్పుడు ఓ విషాద స్థావరంగా మారింది. లోపల దాదాపు 150 మంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నిన్నటి వరకు వినోదం పంచిన నౌక, నేడు ఒక క్వారంటైన్ జైలుగా మారింది. షిప్ డాక్టర్ మొదలుకొని, సామాన్య ప్రయాణికుల వరకు అందరూ ఇప్పుడు వైరస్ నీడలో బందీలు. ఏప్రిల్ 1న మొదలైన ఆ యాత్ర, చివరకు సముద్రం మధ్యలో ఒక నిశ్శబ్ద సమరంగా మిగిలిపోయింది.
ఎలుకల విసర్జితాల నుంచి వ్యాప్తి
ఎలుకల నుంచి పుట్టి, ఇప్పుడు ’ఆండీస్’ రకంగా పరిణామం చెంది మనుషుల మధ్యే వ్యాపిస్తున్న ఈ వైరస్, ఒక అరుదైన విషాదం. తాకడం, కలిసి భోజనం చేయడం వంటి అత్యంత సన్నిహిత చర్యల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి, ప్రకృతి మానవాళికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు తీసిన ఈ వైరస్, మరికొందరి శరీరాల్లో తాండవిస్తోంది.
కెనరీ దీవులకు తరలింపు ఏర్పాట్లు
ప్రస్తుతం ఈ నౌక కేప్ వర్డే తీరంలో నిలిచి ఉంది. బాధితులకు చికిత్స అందించేందుకు, నౌకను సురక్షితంగా చేరవేసేందుకు స్పెయిన్‌లోని కెనరీ దీవుల వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ నౌక రాకపై కెనరీ దీవుల ప్రాంతీయ అధ్యక్షుడు ఫెర్నాండో క్లావిజో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, స్థానిక ప్రజల భద్రత దృష్ట్యా అత్యవసర సమావేశానికి డిమాండ్ చేశారు. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న ఇద్దరు ప్రయాణికులలో ‘అండీస్ స్ట్రెయిన్’ను గుర్తించగా, వారిలో ఒక బ్రిటిష్ వ్యక్తి ఐసీయూలో ఉండగా మరొకరు మరణించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ప్రయాణికుడు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.


