అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్‌ రైజింగ్‌దే కీలకపాత్ర

Fundraising In 2020 United States Presidential Election - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే మాటలు కాదు.. అక్కడ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం డెమొక్రాట్లు, రిపబ్లికన్‌ పార్టీలు పోటీపడి కోట్లకొద్దీ డాలర్లు సేకరిస్తాయి. అటు అమెరికా, ఇటు భారత్‌లోనూ ప్రజాస్వామ్య వ్యవస్థే ఉన్నా.. ఎన్నికల ప్రచార ఖర్చులకు సంబంధించి ఉన్న ప్రధానమైన తేడా ఇదే. ఇక్కడ పార్టీలకు నిధులు ఇవ్వడం గుట్టుగా జరిగిపోతే.. అక్కడ మాత్రం అంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌!. నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

అక్కడి ‘ఫండ్‌ రైజింగ్‌’ కథా.. కమామిషు..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్‌ రైజింగ్‌ది కీలకపాత్ర. 2020 అధ్యక్ష ఎన్నికలనే తీసుకుంటే డెమొక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్‌ దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల డబ్బులు సేకరించగలిగితే.. అధ్యక్షుడిగా ఇంకోసారి ఎన్నిక కావాలని ఆశిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా పదివేల కోట్ల రూపాయల వరకు రాబట్టగలిగారు. అయితే, ఎక్కువ డబ్బులు సమకూర్చుకోగలిగిన, ఖర్చు పెట్టగలిగిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తాడన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాకపోతే గెలిచే అవకాశాలెక్కువ. 2018 నాటి సాధారణ ఎన్నికల్లో (భారత్‌లో రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినట్లే అమెరికాలోని హౌస్, సెనేట్‌ పేర్లతో ఉన్న రెండు సభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిని సాధారణ ఎన్నికలంటారు. అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి) హౌస్‌ కోసం పోటీపడి గెలిచిన వారిలో 89 శాతం మంది ఎన్నికల నిధులను బాగా ఖర్చు పెట్టినవారైతే.. సెనేట్‌లో ఈ సంఖ్య 83 శాతంగా ఉంది. కొత్తగా బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం కోసం నిధులు సేకరించడం కష్టమైన పని. అధికారంలో ఉన్న వారికైతే సులువు.    (పెద్దన్న ఎన్నిక ఇలా..)

నిధుల సేకరణ పలు విధాలు
అమెరికా రాజకీయ నేతలు ఎన్నికల నిధుల కోసం రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. తనకు నిధులివ్వండని నేరుగా హోర్డింగ్‌లు పెట్టడం మొదలు ఇంటింటికీ తిరగడం, పాంప్లెట్లు పంచడం, శ్రేయోభిలాషులు, తమ సిద్ధాంతాలకు మద్దతు తెలిపేవారికి మెయిళ్లు పెట్టడం, విందు భోజనాల ఏర్పా టు, టెలివిజన్, న్యూస్‌పేపర్‌ ప్రకటనల వంటి అనేక రూపాల్లో నిధుల సేకరణ జరుగుతుంది. తనతో కలిసి భోం చేయాలంటే ఇంత మొత్తం చందాగా ఇవ్వాలన్న షరతులు పెట్టడం అక్కడ సాధారణ విషయం. 2008లో బరాక్‌ ఒబామా తొలి సారి సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా నిధుల సేకరణను ప్రారం భించారు. అప్పటి నుంచి ఇప్పటివర కు ఆన్‌లైన్‌ ప్రకటనల ఖర్చు అంతకంత కు పెరిగిపోయి ఏకంగా పదివేల కోట్ల రూపాయల పైమాటే అయ్యింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డబ్బులు సేకరించినంత వేగంగా ఖర్చు పెట్టేయడం.   (భారత్‌తో భాగస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం)

అమెరికన్‌ సివిల్‌ వార్‌ తరువాత రాజకీయ నాయకుల ప్రచార ఖర్చులను భరించడం వల్ల ప్రయోజనాలున్నాయని ధనికులు గుర్తించడం మొదలుపెట్టారు. అయితే కొంత కాలానికి కార్పొరేట్‌ సంస్థలు ఎన్నికల ఖర్చులకు చందాలివ్వడం ఇబ్బందికరంగా పరిణమించడంతో వాటిని నిషేధించేందుకు టెడ్డీ రూజ్‌వెల్ట్‌ విఫలయత్నం చేశారు. ఈ దశలో పుట్టుకొచ్చిన టిల్‌మ్యాన్‌ యాక్ట్‌ కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకులు నేరుగా ప్రచారం ఖర్చుల నిధులు ఇవ్వరాదని తీర్మానం జరిగింది. ఈ చట్టంలోని లోపాలను క్రమేపీ అధిగమించే ప్రయత్నం జరిగినా పరిస్థితిలో మార్పేమీ రాలేదు. తరువాత కాలంలో ఏర్పాటైన ఫెడరల్‌ ఎలక్షన్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా.. నిధుల సేకరణ, ఖర్చుల్లోనూ పారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలైంది. సెంటర్‌ ఫర్‌ రెస్పాన్సివ్‌ పాలిటిక్స్, కన్సూమర్‌ వాచ్‌డాగ్, కామన్‌ కాజ్‌ వంటి సంస్థలు కూడా పార్టీలు ఎంతమేరకు, ఎలా నిధులు సేకరిస్తున్నాయి? ఎలా ఖర్చు పెడుతున్నాయి? అన్న అంశాలపై నిశితమైన నిఘా ఏర్పాటు చేస్తుంటాయి. 

ఫండ్‌రైజింగ్‌లో ఆ 527 గ్రూపులు కీలకం
ఎన్నికల ప్రచారం కోసం నిధులు ఎవరు ఇవ్వవచ్చన్న ప్రశ్న వచ్చినప్పుడు అమెరికాలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్ల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. వీటిలో 527 గ్రూపులు ఒకటి. వ్యక్తులు, పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (పీఏసీ)తోపాటు 527 గ్రూపుల నుంచి నిధులు సేకరించేందుకు అమెరికన్‌ చట్టాలు అనుమతిస్తాయి. సేకరించిన మొత్తం నిధుల్లో సింహభాగం వ్యక్తుల నుంచే అందుతాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఒక్కో వ్యక్తి గరిష్టంగా 2,800 డాలర్లు అభ్యర్థులకు విరాళంగా ఇవ్వవచ్చు. పార్టీకైతే 35 వేల డాలర్ల వరకు చెల్లించవచ్చు. ద్రవ్యోల్బణం తదితర అంశాల ఆధారంగా ఈ గరిష్ట పరిమితులను నిర్ణయిస్తారు. విదేశీయులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు చందాలు ఇవ్వడం నిషేధం. కాకపోతే గ్రీన్‌కార్డ్‌ కలిగి ఉన్న వారిని విదేశీయులుగా పరిగణించరు కాబట్టి వారు అమెరికన్‌ పౌరులతో సమానంగా ఎన్నికలకు నిధులివ్వచ్చు.

పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీలు ప్రైవేట్‌ సంస్థలు ఏర్పాటు చేసుకునేవి. వెయ్యి డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఎన్నికల ఖర్చు కోసం అందించేవి కూడా. ఒకవేళ ఈ పీఏసీ కార్పొరేట్‌ సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదైతే.. యూనియన్‌ సభ్యులు, వారి కుటుంబాలు, షేర్‌ హోల్డర్లు, ఉద్యోగుల నుంచే నిధులు సేకరించి ఇవ్వాలి. ఒక్కో అభ్యర్థికి ఏడాదికి ఐదు వేల డాలర్ల వరకు చెల్లిం చేందుకు పీఏసీలకు అనుమతి ఉంటుంది. అలాగే ఒక పార్టీకి 15,000 డాలర్ల వరకూ చెల్లించవచ్చు. పీఏసీ లు జారీచేసే టీవీ, రేడియో, ప్రింట్‌ ప్రకటనలపై ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. అంటే ఏ అభ్యర్థి ప్రకటన జారీ చేసినా.. దానికైన ఖర్చు ఏ పీఏసీ భరించిందో తెలపాలి. ఇక 527 గ్రూపులు పీఏసీల మాదిరే పనిచేస్తాయి. కానీ ఎన్నికల్లో విధానపరమైన అంశాలను ప్రభావితం చేసేందుకు ఏర్పాటైన లాభాపేక్ష లేని రాజకీయ బృందాలివి. ఇవి అభ్యర్థులకు అనుకూలంగా, ప్రతికూలంగా నేరుగా ప్రచారం చేయవు. ఫలితంగా వీటిపై ఎన్నికల కమిషన్‌ అజమాయిషీ ఉండదు.  (నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం)

పోటాపోటీగా నిధుల సమీకరణ
2020 అధ్యక్ష ఎన్నికల్లో ఒకవైపు రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్, మరోవైపు డెమొక్రాట్ల తరఫున పోటీచేస్తున్న బైడెన్‌ పోటాపోటీగా నిధుల సమీకరణ చేపట్టారు. అయితే నిధుల సేకరణలో ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గా ఉందని అంచనా. ఎందుకంటే సేకరించిన నిధుల్లో బైడెన్‌ కొంతే ఖర్చుపెట్టి చేతిలో నగదు కలిగి ఉండగా.. ట్రంప్‌ మాత్రం ఇప్పటికే జేబులు ఖాళీ చేసుకున్నాడు. అభ్యర్థులు ఎవరైనా సరే.. ఎన్నికల ప్రచారం కోసం సేకరించే నిధుల వివరాలను ప్రతి నెలా ఫెడరల్‌ ఎలక్షన్స్‌ కమిషన్‌కు తెలియజేయాలి. ఎంత మొత్తం సేకరించారు? ఖర్చు పెట్టిందెంత? మిగిలిన మొత్తం ఎంత? అన్న వివరాలతో నెలవారీ నివేదికలు సమర్పించాలి. ఈసారి ఎన్నికలకు ఆగస్టులోనే నిధుల సేకరణ ఘట్టం మొదలు కాగా.. అధ్యక్ష స్థానంలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి నెలలో ప్రత్యర్థి కంటే ఎక్కువ నిధులు కలిగి ఉన్నప్పటికీ సెప్టెంబర్‌ నాటికి పరిస్థితి తారుమారైంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌ మరణం సందర్భంలో, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్‌ను ఎంపిక చేసినప్పుడు బైడెన్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందాయి. 

అప్పట్లో లింకన్‌ దివాలా తీసినంత పనైంది!
అమెరికాలో ఎన్నికలకు, డబ్బుకు ఉన్న సంబంధాలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1700ల ఆఖరులో 21 ఏళ్లపైబడ్డ తెల్లజాతి భూస్వాములు మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండేవారు. అంటే డబ్బున్న వారి మాటే చెల్లుబాటయ్యేది. 1828 నాటికి ఎవరు ఓటేయాలో ఎవరు కూడదో రాష్ట్రాలు నిర్ణయించేవి. కాకపోతే భూస్వాములకు మాత్రమే ఉన్న ఓటుహక్కును తొలగించారు. ఈ సమయంలోనే ఆండ్రూ జాక్సన్‌ అనే రాజకీయ నేత తొలిసారి ఓట్ల ప్రచారం కోసం డబ్బులు సేకరించడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. కొన్ని కమిటీలను ఏర్పాటుచేసి వాటితో ర్యాలీలు, పెరేడ్‌లు నిర్వహించడం ద్వారా ఆండ్రూ జాక్సన్‌ తన సందేశాలను ప్రజల వద్దకు చేర్చేవాడు. ఆ తరువాత కాలంలో అబ్రహం లింకన్‌ తన సొంత డబ్బులతో ప్రచారం నిర్వహించాడు. కొంతమంది ధనిక స్నేహితులూ ఒకింత సాయం చేశారు. అయినా సరే.. ఆ ఎన్నికల్లో లింకన్‌ దివాలా తీసినంత పనైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top