Alaska flooding like Glacial lake outburst flood in Kedarnath - Sakshi
Sakshi News home page

అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్‌నాథ్‌ విపత్తును తలపించేలా..

Published Wed, Aug 9 2023 10:05 AM

Flood in Alaska Like Kedarnath Flooding - Sakshi

అమెరికాలోని అలస్కాలో ఒక నది ప్రవహిస్తుంటుంది. దాని పేరు మెండెన్‌హాల్‌. ఇదే పేరుతో హిమానీనదం(అతి పెద్ద మంచు దిబ్బ) ఉంది. ఇది జనెవు నగరానికి సమీపంలో కొండల నడుమ ఉంది. ఇక్కడ ఈ హిమానీనదం కారణంగా ఒక సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు గుండా నది ప్రవహిస్తుంటుంది. సరస్సుకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడ్డుకట్టు తెగిపోవడంతో నదికి హఠాత్తుగా వరద పోటెత్తింది. ఫలితంగా ఉపద్రవం ముంచుకొచ్చింది. ఇది 2013లో మనదేశంలోని కేదార్‌నాథ్‌లో సంభవించిన విపత్తును తలపించేలా ఉంది. 

జనెవు నగర డిప్యూటీ సిటీ మేనేజర్‌ రాబ్‌ బర్న్‌ ఈ విపత్తుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మెండెన్‌హాల్‌ నదికి అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పలు రోడ్లు నీట మునిగాయి. రెండు భవనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు నిరాశ్రయులయ్యారు. కొందరు వరదల్లో కొట్టుకుపోయారు. పలు భవనాలు ప్రమాదం అంచున ఉన్నాయి. నదీ తీరప్రాంతమంతా కోతకు గురయ్యింది. దీంతో అక్కడ ముప్పు మరింతగా పెరిగింది. 

నది నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వృక్షాలతో పాటు మట్టికూడా కొట్టుకువస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఎమర్జెన్సీ ప్రకటించామని రాబ్‌ బర్న్‌ తెలిపారు. కాగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ హిమానీనదం గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ హిమానీనదం పగిలిపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉన్నాయని చెబుతూవస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ విపత్తు సంభవించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌ పరిణామాలను సూచిస్తున్నదన్నారు. 

జనెవుకు చెందిన శామ్‌ నోలన్‌ ఈ నది ఒడ్డున ఒక భవనం పడిపోతున్న దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. నదిలోని నీరు ఉధృతంగా రావడానికి తోడు, నదిలోని మట్టి కోతకు గురి కావడంతో భవనం అమాంతం కూలిపోయిందన్నారు. ప్రకృతి ప్రకోపాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన తెలిపారు. ఈ వరదల కారణంగా పలు రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: డాక్టర్ vs పేషెంట్.. ఏది న్యాయం? ఏది అన్యాయం?

Advertisement
Advertisement