హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం

Extreme Weather Kills Runners In China Marathon - Sakshi

బీజింగ్‌: మారథాన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో 21 మంది మరణించారు. ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

శనివారం ఉదయం హవాంగే పర్వత ప్రాంతంలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ మొదలైంది. ఆ టైంలో వాతావరణం పొడిగా ఉంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట టైంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, చలి తీవ్రత పెరిగిపోవడం, ఉన్నట్లుండి వడగళ్ల వానతో మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. యెల్లో రివర్‌ స్టోన్‌ఫారెస్ట్‌ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు. చాలామంది కనిపించకుండా పోయారు. దీంతో పోటీని ఆపేసిన నిర్వాహకులు.. సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు.

 

గడ్డకట్టుకుపోయి.. 
మొత్తం 172 మంది ఈ అల్ట్రామారథాన్‌లో పాల్గొన్నారు. వీళ్ల ఆచూకీ కోసం 1200 రెస్క్యూ టీంలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం కల్లా 151 మందిని సురక్షితంగా కాపాడగా, వీళ్లలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 21 మంది చనిపోయారని రెస్క్యూ టీం వర్గాలు వెల్లడించాయి. వీళ్లంతా చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు. మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్‌ ,టీషర్ట్స్‌ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు అంటున్నారు. పరిగెడుతున్న టైంలో హఠాత్తుగా చీకటి అలుముకుందని తన నాలుకతో పాటు వేలు గడ్డకట్టాయని, వెంటనే ఓ చెట్టు తొర్రలోకి వెళ్లి దాక్కున్నానని ట్రీట్‌మెంట్‌ పొందుతున్న ఓ బాధితుడు వెల్లడించాడు. తనతో పాటు మరో పదిమంది దాక్కోగా.. రెస్క్యూ టీం కాపాడిందని తెలిపాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top