పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు

Ex Pak PM Imran Khan Faces Arrest - Sakshi

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు పోలీసులు ఇవాళ ప్రయత్నించారు. ఆ అరెస్టును అడ్డుకునేందుకు పీటీఐ కార్యకర్తలు తీవ్రంగా యత్నించారు. రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు, కవరేజ్‌ కోసం జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. దీంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు తన అరెస్టును అడ్డుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టును ఆశ్రయించారు. 

అవినీతి ఆరోపణలు.. తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేసేందుకు గత కొన్నిరోజులుగా పోలీసులు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో లాహోర్‌లోని జమాన్‌ పార్క్‌లో ఉన్న ఆయన ఇంటి వద్ద గత రెండు వారాలుగా హైడ్రామా నడుస్తోంది. అరెస్టు కోసం చాలా పకడ్బందీగా ఆపరేషన్‌ సిద్ధం చేసిన పోలీసులు.. ఇవాళ దానిని అమలు చేయడానికి యత్నించారు. అయితే.. అదే సమయంలో ఆయన మద్దతుదారులు అడ్డుకునేందుకు యత్నించారు.

ఇక అరెస్ట్‌ ప్రక్రియ ఆగిపోయిన వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ వీడియో సందేశం రిలీజ్‌ చేశారు. తాను జైలుకు వెళ్లినా.. తనను చంపేసినా.. పాక్‌ ప్రజలు తమ హక్కుల కోసం షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వంతో పోరాడడం ఆపొద్దని పిలుపు ఇచ్చారు. 

ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒక కార్యకర్త సైతం మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం ద్వారా కిందటి ఏడాది గద్దె దిగిపోయిన ఇమ్రాన్‌ ఖాన్‌పై ఇప్పటిదాకా 81 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. 

(చదవండి: యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే.. పుతిన్‌ భవిష్యత్‌పై మాజీ దౌత్యవేత్త)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top