షాకింగ్‌: పురుషుడనుకుంటే..  గర్భవతని తెలిసింది

Egyptian Mummy Believed To be of Male Priest Turns Out to Be Pregnant Woman - Sakshi

ఈజిప్టులో వెలుగు చూసిన సంఘటన

శతాబ్దానికి పైగా పురుషుడిదిగా భావించిన మమ్మీ

సీటీ స్కాన్‌లో మహిళని.. గర్భవతి అని వెల్లడి

వార్సా: ఇన్నాళ్లు తాము పురుషుడిగా భావించిన ఓ  ఈజిప్ట్‌ మమ్మీ గురించి ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసి.. పురావస్తు శాస్త్రవేత్తలు షాక్‌ అయ్యారు. వారిని అంత ఆశ్చర్యానికి గురి చేసిన ఆ విషయం ఏంటంటే.. దాదాపు శతాబ్దానికి పైగా తాము పురుషుడిగా భావిస్తున్న మమ్మీ మహిళదని.. అందునా గర్భవతి అని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు.. 19వ శతాబ్దంలో పోలాండ్‌లోని నాసెంట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ వార్సా పురాతన వస్తువులను సేకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో పూజారిదిగా భావిస్తున్న ఓ మమ్మీని ఇక్కడకు తీసుకువచ్చారు. దాదాపు శతాబ్దానికి పైగా ఆ మమ్మీని హోర్-దేహుతి అనే పురాతన ఈజిప్టు పూజారికి చెందినదని భావించారు శాస్త్రవేత్తలు.

ఈ క్రమంలో వార్సా మమ్మీ ప్రాజెక్ట్‌లోని శాస్త్రవేత్త మార్జెనా ఓజారెక్-స్జిల్కే నేషనల్‌ మ్యూజియంలో ఉన్న మమ్మీకి గురువారం సీటీ స్కాన్‌ నిర్వహిస్తుండగా ఓ అంశం ఆమెను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఓజారెక్-స్జిల్కే మాట్లాడుతూ.. ‘‘నేను సదరు మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. లోపల నాకు చిన్న పాదం లాంటి ఆకారం కనిపించింది. దీని గురించి స్పష్టత కోసం శాస్త్రవేత్త అయిన నా భర్తను పిలిచి.. నేను గమనించని విషయం తనకు తెలిపాను. ఆయన దాన్ని పరిశీలనగా చూసి.. ‘‘అవును నీకు కనిపించింది పాదమే. ఈ మమ్మీ గర్భవతి. తన కడుపులో బిడ్డ ఉంది. ఆ పిండం వయసు 26-28 వారాల మధ్య ఉంటుంది’’ అని తెలిపారు’’ అన్నారు ఓజారెక్‌.

‘‘‘‘ఇన్నాళ్లు మనం పురుషుడుగా భావిస్తున్న ఈ మమ్మీ మహిళ. తన వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని నా భర్త తెలిపారు. ఆయన చెప్పిన విషయం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు పైగా సదరు మమ్మీని పురుషుడిగా భావిస్తున్నాం. తను ఇప్పుడు మహిళ అని.. అందునా గర్భవతి అని తెలిసి చాలా షాకయ్యాం’’ అన్నారు ఓజారెక్‌.

ఓజారెక్‌ మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళ మృతికి కారణం సరిగా తెలియలేయడం లేదు. కాకపోతే గర్భం వల్లనే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నాం. ఈ కాలంలో అయితే మన దగ్గర ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ముందుగా తెలుసుకునే వాళ్లం. కానీ అప్పట్లో అలా కాదు. పైగా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి. ఇక ఈ మమ్మీ స్త్రీ అని.. అందునా గర్భవతి అని తెలిసిన నాటి నుంచి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. పురాతన ఈజిప్టు సమాజంలో మహిళల జీవిన విధానం ఎలా ఉండేది.. ఈజిప్టు మతాచారాల ప్రకారం పిల్లలను ఎలా చూసేవారు.. గర్భంలోని పిండానికి కూడా పునర్జన్మ, ఆత్మ వంటివి వర్తిస్తాయని భావించేవారా వంటి తదితర విషయాల గురించి అధ్యాయనం చేయాల్సి ఉంది’’ అని ఓజారెక్‌ తెలిపారు. 

చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top