3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’

3000 Year Old Lost Golden City Aten Unearthed In Egypt - Sakshi

ఈజిప్ట్‌లో బయటపడిన పురాతన నగరం

టుటన్ఖమాన్‌ సమాధి తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆవిష్కరణ

కైరో: ఈజిప్ట్‌లో పురాతత్వవేత్త శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతన పట్టణాన్ని గుర్తించారు. 3 వేల సంవత్సరాల క్రితం నాటి ‘లాస్ట్‌ గోల్డెన్‌ సిటీ’ అనే పేరుగల నగరాన్ని శాస్త్రవేత్తల బృందం ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్‌లో గుర్తించింది. ఈజిప్ట్‌లో గతంలో బయటపడిన టుటన్ఖమాన్‌ సమాధి తర్వాత ఈ పట్టణం అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘లాస్ట్‌ సిటీ’గా పిలివబడుతన్న ఈ పట్టణం పేరు ఏతెన్‌. 1391 నుంచి 1353 బీసీ మధ్యకాలంలో పురాతన ఈజిప్ట్‌ని పాలించిన 18 వ రాజవంశానికి చెందిన తొమ్మిదవ రాజు కింగ్ అమెన్హోటెప్ III ఈ నగరాన్ని నిర్మించినట్లు చరిత్ర వెల్లడిస్తుందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. 

లక్సోర్ పశ్చిమ ఒడ్డున నిర్మించిన ఈ నగరం ఆ యుగంలో అతిపెద్ద పరిపాలనా, పారిశ్రామిక  కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్ర వెల్లడిస్తుంది. "ఈ లాస్ట్‌ సిటీ ఆవిష్కరణ.. టుటన్ఖమాన్ సమాధి తరువాత రెండవ అతి ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ" అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఈజిప్టు ప్రొఫెసర్, ఈ మిషన్ సభ్యుడు అయిన బెట్సీ బ్రయాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిష్కరణ సామ్రాజ్యం సంపన్న స్థితిలో ఉన్నప్పుడు పురాతన ఈజిప్షియన్ల జీవితానికి సంబంధించిన అరుదైన సమాచారాన్ని ఇస్తుంది" అన్నారు బెట్సీ.

పురాతన ఈజిప్టును పాలించిన రాజవంశాల గురించి దేశవ్యాప్తంగా సాగుతున్న అధ్యయనంలో ఇటీవల కాలంలో కనుగొన్న పురావస్తు పరిశోధనల శ్రేణిలో ‘‘లాస్ట్‌ సిటీ’’ ఆవిష్కరణ తాజాది. కరోనా వైరస్ మహమ్మారి, ఇస్లామిస్ట్ మిలిటెంట్ దాడులు, రాజకీయ అస్థిరత వల్ల గత కొద్ది కాలంగా తీవ్ర ఒడిదుడుకులకు గురైన ఈజిప్ట్‌ పర్యాటక రంగానికి ఇటువంటి ఆవిష్కరణలు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని.. పర్యాటకులను ఆకర్షిస్తాయని ఈజిప్ట్‌ ప్రభుత్వం భావిస్తోంది. 

ఇక గతంలో చాలా విదేశీ బృందాలు ఈ నగరం కోసం పరిశోధించాయని.. కానీ వారు ఎవరు దీన్నీ గుర్తించలేకపోయారని బెట్సీ తెలిపాడు. ఈ నగరం అమెన్హోటెప్ III కాలం నుంచి ఆయన కుమారుడు, టుటింఖ్‌మాన్‌ తండ్రి అమెన్హోటెప్‌  IV వరకు ఉన్నత స్థితిలో ఉన్నదని చరిత్ర వెల్లడిస్తోంది. నగరం వీధులు ఇళ్ళతో చుట్టుముట్టబడి ఉన్నాయని శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడైన హవాస్ తెలిపాడు. ఈ నగరంలో కొన్ని గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింగ్ అమేన్‌హోటెప్ III ముద్రలను కలిగి ఉన్న వైన్ నాణాలు, ఉంగరాలు, స్కార్బ్‌లు, కుండలు, మట్టి ఇటుకలపై దొరికిన చిత్రలిపి శాసనాల ద్వారా పురావస్తు బృందం ఈ నగరం వర్థిల్లిన కాలాన్ని గుర్తించింది.

నగరం దక్షిణ భాగంలో, పురావస్తు శాస్త్రవేత్తలు ఆహారాన్ని నిల్వ చేయడానికి కుండలు, ఓవెన్‌లు ఉన్న బేకరీతో పాటు పెద్ద వంటగదిని కనుగొన్నారు. ఒక ప్రవేశ ద్వారం మాత్రమే ఉన్న జిగ్‌జాగ్ గోడతో కంచె వేయబడిన పరిపాలనా, నివాస జిల్లాను వారు కనుగొన్నారు. ఇది భద్రత కల్పించడానికి ఉద్దేశించినదిగా భావిస్తున్నారు. మూడవ ప్రాంతంలో ఒక వర్క్‌షాప్ ఉంది. ఆలయం, సమాధులతో పాటు తాయెత్తులు, ఆభరణాలను తయారు చేయడానికి ఉపయోగించే కాస్టింగ్ అచ్చులను బృందం కనుగొంది.

"తవ్విన ప్రాంతాలన్నిటిలో, స్పిన్నింగ్, నేత వంటి పారిశ్రామిక కార్యకలాపాలలో ఉపయోగించే అనేక సాధనాలను మా బృందం గుర్తించింది’’ అని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఒక గదిలో రెండు ఆవులు లేదా ఎద్దుల సమాధులు కనుగొన్నారు. మరొక ప్రాంతంలో ఒక వ్యక్తి అవశేషాలు గుర్తించారు. నగరానికి ఉత్తరాన ఒక పెద్ద స్మశానవాటిక, అలాగే రాతి నుంచి కత్తిరించిన సమాధుల సమూహం బయటపడినట్లు వెల్లడించారు.

చదవండి:
మనుషుల్ని తిన్నారు.. పందుల్ని వదిలేశారు
వామ్మో.. మమ్మీల జులుస్‌.. ఎంత భయంకరంగా ఉందో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top