మెరుపులనే దారి మళ్లించారు!

Ecole Polytechnique Research Deflects Lightning With A Laser Lightning Rod - Sakshi

పిడుగుల రక్షణ వ్యవస్థలో మేలిమలుపు!

భారీ నిర్మాణాలకు ఇక పూర్తిస్థాయి రక్షణ

పారిస్‌: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్‌ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు.

పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్‌ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్‌ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు.

ఫ్రాన్స్‌లోని ఎకోల్‌ పాలిటెక్నిక్స్‌ లేబొరేటరీ ఆఫ్‌ అప్లైడ్‌ ఆప్టిక్స్‌కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్‌ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్‌ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్‌ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్‌ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు.

‘‘అతి శక్తిమంతమైన లేజర్‌ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్‌ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ జీన్‌ పియరీ వూల్ఫ్‌ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్‌ నేచర్‌ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్‌ లేజర్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top