ఇరాన్‌పై యుద్ధం ముగిసింది..  కాంగ్రెస్‌ అనుమతి అక్కర్లేదు  | Donald Trump tells Congress the Iran war has terminated as legal deadline hits | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధం ముగిసింది..  కాంగ్రెస్‌ అనుమతి అక్కర్లేదు 

May 3 2026 4:53 AM | Updated on May 3 2026 4:53 AM

Donald Trump tells Congress the Iran war has terminated as legal deadline hits

చట్టసభ సభ్యులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ లేఖ  

వాషింగ్టన్‌:  ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్‌ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్‌ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 

1973 నాటి వార్‌ పవర్స్‌ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్‌ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్‌ శుక్రవారం కాంగ్రెస్‌ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్‌ పవర్స్‌ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 

ఇరాన్‌పై యుద్ధం గురించి కాంగ్రెస్‌ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్‌ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్‌లైన్‌ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్‌ అంగీకరించడం లేదు.  

వారికి లేని అనుమతి నాకెందుకు?  
ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేదని ట్రంప్‌ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్‌–ఇన్‌–చీఫ్‌లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్‌ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్‌ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్‌ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు.  

ఇరాన్‌ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం 
చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌  
వాషింగ్టన్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చమత్కరించారు. ఇరాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. 

ట్రంప్‌ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్‌ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్‌ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు.  

హార్మూజ్‌లో ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం  
దుబాయ్‌:  హార్మూజ్‌ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్‌కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్‌ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్‌ ఆఫీసు ఆఫ్‌ ఫారిన్‌ అసెట్స్‌ కంట్రోల్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్‌ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్‌ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్‌ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement