
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కారు సమూలంగా ప్రక్షాళన చేయనుంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయనుంది. న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్∙డైరెక్టర్ జోసెఫ్ పలు అంశాలపై మాట్లాడారు. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతానాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు.
పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్–1బీ వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలాకాలంగా గగ్గోలు పెడుతుండటం తెలిసిందే. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కారు తాజా నిర్ణయాలు చెక్ పెడతాయని భావిస్తున్నారు.
అయితే వ్యాపార వర్గాలు, కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చని అమెరికా మీడియా కోడై కూస్తోంది. విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభతరంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు. ‘‘పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి. ఇది చట్టస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తాం’’అని స్పష్టం చేశారు.