అమెరికాలో భారతీయుడికి కీలక బాధ్యతలు

Doctor Vivek Murthy May Get Place In Joe Biden Govt - Sakshi

బైడెన్ సర్కార్‌లో డాక్టర్‌ వివేక్‌ మూర్తికి చోటు

వాషింగ్టన్‌ : ఉత్కంఠ భరింతగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీలో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించి.. డొనాల్డ్‌ ట్రంప్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. నాలుగేళ్ల ట్రంప్‌ పాలనతో విసుగుచెందిన అమెరికన్స్‌.. బైడెన్‌కు పట్టంకట్టారు. విమర్శలు, వివాదాలతో కాలంగడిపిన అధ్యక్షుడిని కోలుకోని దెబ్బకొట్టారు. మొదట నుంచీ విజయంపై అత్యాశ పడ్డ ట్రంప్‌కు చివరికి నిరాశే ఎదురైంది. ఇక ఈ ఎన్నికల్లో డెమోక్రాట్స్‌ నుంచి బరిలో నిలిచి అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారీస్‌ చరిత్ర సృష్టించారు. ఆమెకు ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌)

ముఖ్యంగా భారతీయులు పొగడ్తలతో ముంచెత్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.  గతంలో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా కమలా హ్యారీస్‌ కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ఇప్పుడు ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బైడెన్‌ సర్కార్‌లో మరో భారతీయుడికి చోటు దక్కే అవకాశం ఉందని అమెరికా వర్గాల ద్వారా తెలుస్తోంది. డాక్టర్‌ వివేక్‌ మూర్తికి టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన మూర్తిని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్‌గా నియమించారు. అమెరికాలో కరోనా వైరస్ అదుపునకు కొత్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మూర్తినే చీఫ్‌గా నియమిస్తారని సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఒక్క రోజే 1,031 మంది మృతి
ఇక అమెరికాలో కరోనా వైరస్‌ కొత్త కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 1.24లక్షల కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. మరోవైపు ఒక్క రోజే 1,031 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా కరోనా కేసులు, 2.43లక్షల మరణాలు సంభవించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top