యూకేలో ‘డెల్టా’ ప్రమాద ఘంటికలు 

Delta Variant Of Coronavirus Dominates In UK - Sakshi

లండన్‌: భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ లేదా బి.1.617.2 కేసులు భారీగా పెరుగుతుండటంపై యూకే ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వారం వ్యవధిలోనే ఈ వేరియంట్‌ బారిన 5,472 మంది పడగా, మొత్తం బాధితుల సంఖ్య గురువారానికి 12,431కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్‌ బాధితుల్లో ఈ వారంలో 278మంది, గత వారం 201 మంది ఆస్పత్రుల్లో చేరారని పేర్కొంది. వీరిలో చాలా మంది కోవిడ్‌ టీకా వేయించుకోని వారేనని వివరించింది. బోల్టన్, బ్లాక్‌బర్న్‌ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు బయటపడ్డాయని పేర్కొంది. 

డెల్టా వేరియంట్‌పై ఫైజర్‌ టీకా ప్రభావం తక్కువే 
లండన్‌: ‘ఫైజర్‌–బయోఎన్‌టెక్‌’ టీకా తీసుకున్నవారికి భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్‌ వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ వివరాలను తాజాగా లాన్సెట్‌ పత్రికలో ప్రచురించారు. వైరస్‌ను గుర్తించి, పోరాడే ఈ యాంటీబాడీలు పెద్ద వయస్సు వారిలో మరింత తక్కువగా ఉత్పత్తి అయినట్లు తేలింది. వయస్సు పెరుగుతున్న కొద్దీ యాంటీబాడీలు తగ్గుతున్నాయని నిర్ధారణ అయినట్లు ఆ పత్రిక వెల్లడించింది. దాంతో, రెండు డోసుల మధ్య సమయాన్ని తగ్గించాలన్న వాదనకు, బూస్టర్‌ డోస్‌ టీకా వేసుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరుతోంది. యూకేలోని ఫ్రాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం జరిపింది.
చదవండి: ఆ వేరియంట్‌ వల్లే భారీగా కేసులు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top