డ్రాగన్‌ దుష్ట పన్నాగాలు

Chinese Flag Provocation In Galwan Valley Indian Army Sources Clarity - Sakshi

యుద్ధ సమయాల్లో పైచేయి సాధించేందుకు ప్యాంగాంగ్‌ త్సో సరస్సులో వంతెనను నిర్మించిన చైనా

గల్వాన్‌లో జెండాను ఎగరేసిన వైనం

ఇకనైనా ప్రధాని మౌనం వీడాలి: రాహుల్‌

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి తన యుద్ధకాంక్షను బయటపెట్టింది. రణక్షేత్రంలో తమకు ఎదురు నిలిచే దేశంపై పైచేయి సాధించేందుకుగాను సరిహద్దులకు వేగంగా సైన్యాన్ని, శతఘ్నులను తరలించేందుకు పటిష్ట ప్రణాళికలతో దూసుకెళ్తోంది. భారత్‌–చైనా మధ్య 18 నెలలుగా తీవ్ర ఉద్రిక్తంగా తయారైన తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ ప్రాంతంలో ఒక వంతెనను నిర్మించింది. ప్యాంగాంగ్‌ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని యుద్ధప్రాతిపదికన నిర్మించారని తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమైంది.

భారత్‌తో ఘర్షణ తలెత్తితే హుటాహుటిన సైన్యాన్ని, భారీ ఆయుధాలను, యుద్ధ సామగ్రిని తరలించాలనే ఎత్తుగడతోనే చైనా దీన్ని నిర్మించిందని శాటిలైట్‌ ఫొటోలకు సంబంధించిన జియో ఇంటెలిజెన్స్‌ నిపుణుడు డామిన్‌ సైమన్‌ విశ్లేషించారు. ప్యాంగాంగ్‌ సరస్సు దక్షిణం వైపున ఉన్న కైలాస్‌ శిఖరాలను ముందుగా చేరుకుని గత ఏడాది భారత సేనలు అక్కడ పట్టు సాధించాయి. దీంతో భవిష్యత్తులో భారత సైన్యానికి దీటుగా స్పందించేందుకే సైన్యం మోహరింపునకు వీలుగా కొత్త వంతెనను చైనా సిద్ధం చేసిందని తెలుస్తోంది. కొత్త వంతెన ద్వారా అదనపు ప్రాంతాల్లోనూ భారీ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపి చైనా బరితెగించనుంది.

2020 తొలినాళ్ల నుంచే భారత్, చైనా చెరో 50 వేల సైన్యాన్ని తూర్పు లద్దాఖ్‌లో మోహరించాయి. 2020 జూన్‌లో గల్వాన్‌ నదీ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం ఘర్షణల్లో 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. తెలంగాణకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు. దాదాపు ఏడాదిపాటు తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యమేలింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీల చర్చల తర్వాత ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని ఇరుదేశాల సైన్యాలు నిర్ణయించాయి.

అటు వైపే బ్రిడ్జి కట్టారు
సరిహద్దు వెంట చైనా అధీనంలోని ప్రాంతంలోనే బ్రిడ్జి నిర్మాణం జరిగిందని భారత ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. రెండు కి.మీల. నిస్సైనిక ప్రాంతంలో ఈ వంతెనను నిర్మించలేదని, గల్వాన్‌ ఘర్షణల తర్వాత కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘించలేదని భారత సైనిక వర్గాలు తెలిపాయి. 

అంగుళం కూడా వదులుకోం: గ్లోబల్‌ టైమ్స్‌
కొత్త సంవత్సరం మొదలైన కొద్ది గంటలకే గల్వాన్‌ లోయ తమదేనంటూ తమ జాతీయ జెండాను చైనా గల్వాన్‌లో ఎగరేసిందని ఆ దేశ జాతీయ మీడియా సంస్థలు సంబంధిత వీడియోను ప్రముఖంగా ప్రసారం చేశాయి. ‘ఒక్క అంగుళం నేల కూడా వదులుకునేది లేదు’ అనే సందేశాన్ని చైనా సైనికులు తమ పౌరులకు కొత్త సంవత్సర కానుకగా పంపించారని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ట్వీట్‌ చేసింది. దీంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై మండి పడ్డాయి. ‘గల్వాన్‌ లోయకు మన త్రివర్ణ పతాకమే సరిగ్గా సరిపోతుంది.  ప్రధాని మౌనదీక్షను వీడి చైనా ఆక్రమణలపై మా ట్లాడాలి’ అని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. 

(చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!)
(చదవండి: దక్షిణాఫ్రికా ‘పార్లమెంట్‌’లో అగ్ని ప్రమాదం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top