షాకింగ్.. అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ తొలగింపు.. సైన్యం చేతిలోకి చైనా!

China President Xi Jinping under house arrest Rumors Spread - Sakshi

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నియంత్రణ అంతా చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) చేతుల్లోనే ఉందని వదంతులు వ్యాపించాయి. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ ఆర్మీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేశారు. ఈ రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సారి చెక్‌ చేయండి. అని సుబ్రహ్మణ్య స్వామి రాసుకొచ్చారు.

కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది.

వీడియో వైరల్‌
చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది. జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోందని పేర్కొంది.

అకస్మాతుగా ఎందుకీ రూమర్‌?
చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారని తెలుస్తోంది. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేతలు ఆయనపై ఆ‍గ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిన్‌పింగ్‌ను ఆర్మీ గృహ నిర్బంధం చేసిందనే వదంతిని మొదటగా ఆయన రాజకీయ ప్రత్యర్థి వర్గమే వ్యాపింపజేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జిన్‌పింగ్ ఇటీవలే ఉజ్బెకిస్థాన్‌ సామర్‌కంద్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కూడా పాల్గొన్నారు.

చదవండి: ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top