ఆస్ట్రేలియా పోలీసులపై నెటిజనుల ఆగ్రహం

Australia Pregnant Woman Arrested for Advocating Against Lockdown - Sakshi

కాన్‌బెర్రా: కరోనా కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు జరపాలని భావించినా మన దగ్గర మాత్రం కుదరలేదు. ఉప్పు, పప్పు అంటూ జనాలు రోడ్ల మీద తెగ తిరిగారు. మన దగ్గర ఇలా ఉంటే ఆస్ట్రేలియాలో మాత్రం చాలా కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేస్తున్నారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే సరాసరి జైలుకే తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆస్ట్రేలియా పోలీసులు 28 ఏళ్ల గర్భవతి అయిన మహిళను ఆమె ఇంటికి వచ్చి​ అరెస్ట్‌ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ తతంగం అంతా లైవ్‌ స్ట్రీమ్‌ కావడంతో మిలయన్ల మంది దీన్ని వీక్షించారు. వివరాలు.. విక్టోరియా, మెల్‌బోర్న్‌లో కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్‌ని అమలు చేస్తోంది. అయితే దీనికి వ్యతిరేకంగా కొందరు జనాలు వారాంతలో ర్యాలీ నిర్వహించారు. (చదవండి: రెండు నెలలు బట్టలు ఉతకలేదు, ఆపై...)

28 ఏళ్ల జో బుహ్లెర్ దానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దాంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి.. భర్త, పిల్లల ఎదురుగానే జోను అరెస్ట్‌ చేశారు. ఆమె భర్త ఈ అరెస్ట్‌ వ్యవహారాన్ని లైవ్‌ స్ట్రీమ్‌ చేయడంతో ఇది తెగ వైరలయ్యింది. ఏ మాత్రం కనికరం లేకుండా గర్భవతిని అరెస్ట్‌ చేయడం దారుణం అంటూ నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తమ చర్యలను పూర్తిగా సహేతకమైనవిగా వర్ణించారు. ‘జో లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించడమే కాక.. ఇతరులు కూడా అలానే చేసేలా ప్రేరేపిస్తోంది. అందుకే ఆమెను అరెస్ట్‌ చేశాం. ఇప్పటికే నలుగురు పురుషులను కూడా అదుపులోకి తీసుకున్నాం. చట్టాన్ని అతిక్రమిస్తే ఇలానే అవుతుంది. ఆ విషయంలో మాకు అందరూ సమానమే. అంతేకాక ఇది పూర్తిగా సహేతకమైన చర్య’ అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top