
సీనియర్ నేతను ఎన్నుకున్న పార్లమెంట్
రాజు ఆమోదం అనంతరం కేబినెట్ ప్రమాణం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా సీనియర్ నేత అనుతిన్ చర్న్‌విరకుల్(58) ఎన్నికయ్యారు. శుక్రవారం పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో పాల్గొన్న 492 మందికి గాను భుమ్‌జైతై పార్టీ తరఫున పోటీకి దిగిన అనుతిన్‌కు అనుకూలంగా 311 మంది ఓటేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వం బలపర్చిన చైకసెం నితిసిరికి 152 ఓట్లు పోలయ్యాయి.
అనుతిన్ ఎన్నికపై రాజు మహా వజ్రలంగ్‌కొర్న్ అధికార ముద్ర వేశాక అనుతిన్, ఆయన మంత్రివర్గం ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. థాయ్‌లాండ్–కాంబోడియా మధ్య ఎన్నాళ్లుగానో సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో జూన్‌లో ప్రధానిగా ఉన్న పెటొంగ్‌టర్న్ షినవత్రా కాంబోడియా సీనియర్ నేత హున్‌సెన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ లీకై తీవ్ర సంచలనం రేపింది.
షినవత్రా, హున్‌సెన్‌ల సంభాషణ కాంబోడియాకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప, తమ దేశానికి కాదని దర్యాప్తు చేపట్టిన రాజ్యాంగ న్యాయస్థానం పేర్కొంది. ఆమె తీరు ప్రధాని పదవికి తగినట్లుగా లేదని ఆక్షేపిస్తూ పదవి నుంచి తొలగిస్తూ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు భుమ్‌జైతై పార్టీ నేత అనుతిన్ ప్రకటించారు. మైనారిటీలో పడిన షినవత్రా సారథ్యంలోని ఫ్యు థాయ్ పార్టీ ఆపద్ధర్మ ప్రభుత్వం పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేసింది. ఈ సిఫారసును రాజు కనుసన్నల్లో నడిచే ప్రీవీ కౌన్సిల్ తిరస్కరించింది. ఈ పరిణామంతో పార్లమెంట్‌లో నూతన ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
పార్లమెంట్ రద్దుకు హామీ
అనుతిన్ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతిచ్చేందుకు పీపుల్స్ పార్టీ ముందుకు వచ్చింది. అయితే, నాలుగు నెలల్లో పార్లమెంట్‌ను రద్దు చేయడం, గతంలో సైనిక పాలన సమయంలో తీసుకువచ్చిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెఫరెండం విధించడం వంటి షరతులు విధించింది. దీంతో, అనుతిన్ అస్థిర ప్రభుత్వంగానే సాగనుంది.
2023 ఎన్నికల్లో అత్యధిక సీట్లను పీపుల్స్ పార్టీయే గెలుచుకుంది. కానీ, ప్రతినిధుల సభ, సైనిక ప్రతినిధులతో కూడిన సెనేట్ చేపట్టిన ఉమ్మడి ఓటింగ్‌లో ఆ పార్టీకి చెందిన అభ్యర్థి మెజారిటీ ఓట్లను గెలుచుకోలేకపోయారు. పీపుల్స్ పార్టీ తలపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను రాజుకు అనుకూలమైన సెనేట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఫ్యు థాయ్ పార్టీకి చెందిన శ్రేథ్థ థవిసిన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
ఆయన్ను కూడా నైతిక ఉల్లంఘన ఆరోపణలపై రాజ్యాంగ న్యాయస్థానం దించేసింది. ఆ తర్వాత మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రా కుమార్తె పెటొంగ్‌టర్న్ అతిపిన్న వయసు్కరాలైన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె పాలన సైతం ఏడాదిలోనే ముగిసిపోయింది. అనుతిన్ 2023లో అధికారంలోకి వచ్చిన ఫ్యు థాయ్ సంకీర్ణంలో, అంతకుమునుపు మాజీ ప్రధాని ప్రయుత్ చన్ ఓచా కేబినెట్‌లోనూ మంత్రిగా పనిచేశారు.
మళ్లీ దుబాయ్‌కి థక్సిన్
థాయ్‌లాండ్ రాజకీయాల్లో దశాబ్దాలపాటు కీలకంగా ఉన్న మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రా(76) మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గురువారం రాత్రి 7 గంటల వేళ బ్యాంకాక్‌లోని డాన్ మ్యుయెగ్ విమానాశ్రయం నుంచి ఆయన ప్రైవేట్ జెట్ విమానం టేకాఫ్ తీసుకుందని అధికారులు తెలిపారు. సింగపూర్ వెళ్తున్నట్లు థక్సిన్ చెప్పారన్నారు.
ఆయనకు వ్యతిరేకంగా కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు, అరెస్ట్ వారెంట్లు లేవని, అందుకే అడ్డుకోలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎయిర్ పోర్టులో అధికారులు తన విమానాన్ని రెండు గంటలపాటు నిలిపివేశారని అనంతరం థక్సిన్ ఎక్స్‌లో తెలిపారు. దీంతో, వైద్య చికిత్సల నిమిత్తం సింగపూర్ వెళ్లలేక పోయానని, బదులుగా దుబాయ్‌కి వెళ్తున్నట్లు వెల్లడించారు. గతంలో 2008 నుంచి థక్సిన్ దుబాయ్‌లోనే అజ్ఞాతంలో ఉన్నారు.