రన్‌వేపై ఫైర్‌ట్రక్‌ను ఢీకొట్టిన విమానం  | Air Canada crash, Two pilots dead | Sakshi
Sakshi News home page

రన్‌వేపై ఫైర్‌ట్రక్‌ను ఢీకొట్టిన విమానం 

Mar 24 2026 4:32 AM | Updated on Mar 24 2026 6:27 AM

Air Canada crash, Two pilots dead

ఛిద్రమైన కాక్‌పిట్‌ భాగం  

పైలట్, కోపైలట్‌ దుర్మరణం 

41 మంది ప్రయాణికులకు గాయాలు 

న్యూయార్క్‌ లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

న్యూయార్క్‌: అప్పుడే ల్యాండ్‌ అయి రన్‌వే మీద దూసుకుపోతున్న విమానం అటుగా వచ్చిన ఒక అగ్నిమాపక విభాగ ట్రక్కును ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఆ దెబ్బకు విమానం కాక్‌పిట్‌ భాగం మొత్తం ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో కాక్‌పిట్‌లోని పైలట్, కోపైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ప్రయాణికుల్లో 41 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వెంటనే వీళ్లను సమీప ఆస్పత్రికి తరలించారు.

 వీరిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరిని ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్‌ చేశారు. ఫైర్‌ట్రక్కులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్‌లోని లాగార్డియా అంతర్జాతీయ విమానాశ్రయం నాలుగో నంబర్‌ రన్‌వే మీద స్థానికకాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 

న్యూయార్క్, న్యూజెర్సీల పోర్ట్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరిర్‌ గార్సియా చెప్పిన వివరాల ప్రకారం కెనడాలోని మాంట్రియల్‌ నుంచి 72 మంది ప్రయాణికులతో బయల్దేరిన ‘ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌’8646 నంబర్‌ విమానం క్షేమంగానే లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయి రన్‌వే మీద గంటకు 167 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అయితే కొద్దిసేపటికి ముందే మరో రన్‌వే మీద దిగిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో దుర్వాసన వస్తోందని ఆ విమాన పైలట్‌ ఫిర్యాదుచేశారు. దీంతో వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోని అగ్నిమాపక, అత్యయిక విభాగం వాహనం రంగంలోకి దిగింది. 

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని చేరేందుకు నాలుగో నంబర్‌ రన్‌వే దాటేందుకు ప్రయతి్నంచింది. అదేసమయంలో ఆ రన్‌వేమీదుగా దూసుకెళ్తున్న కెనడా విమానం ఈ ట్రక్కును నేరుగా ఢీకొట్టింది. దెబ్బకు విమానం ముందుభాగం తుక్కుతుక్కయింది. అయితే ముందువైపు ఉన్న ఎగ్జిట్‌ డోర్‌ గుండా ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఒక పెద్ద నిచ్చెన తెప్పించి విమానానికి అనుసంధానం చేశారు. అప్పటిదాకా కిందకు పడిపోయిన ముందుభాగం ఒక్కసారిగా విమానం బరువులో సమతుల్యత లోపించడంతో ముందుభాగం గాల్లోకి లేచి వేలాడటం మొదలెట్టింది. 

దీంతో ప్రయాణికులను బయటకు తీసుకురావడం కొంత కష్టంగా మారింది. అయితే ‘విమానం వస్తోంది. ఒకటో నంబర్‌ ట్రక్కు అటుగా వెళ్లొద్దు. ఆగిపొండి. ఆగిపొండి’అని ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ నుంచి తీవ్ర హెచ్చరిక సందేశాలు వచ్చినా విమానాల శబ్దహోరులో ట్రక్కు డ్రైవర్‌కు విన్పించకపోయిఉండొచ్చని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరిర్‌ గార్సియా అభిప్రాయపడ్డారు. లాగార్డియా అంతర్జాతీయ విమానాశ్రయం అమెరికాలోని అత్యంత రద్దీమయ ఎయిర్‌పోర్టులో ఒకటి. ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిని్రస్టేషన్, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ల ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరగనుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement