24 Lawmakers Of Ruling PTI To Vote Against Pakistan PM Imran Khan, Details In Telugu - Sakshi
Sakshi News home page

సొంత పార్టీలోనే 24 మంది ఎంపీల తిరుగుబాటు 

Mar 19 2022 7:40 AM | Updated on Mar 19 2022 10:11 AM

24 Lawmakers Of Ruling PTI To Vote Against PM Imran Khan - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ చిక్కుల్లో పడ్డారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే సొంత పార్టీలోనే ఆయనకు తిరుగుబాటు ఎదురైంది. 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఇమ్రాన్‌ను గద్దె దింపేస్తామని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి బాధ్యత ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–ఇన్సాఫ్‌ (పీటీఐ) ప్రభుత్వానిదేనని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)కి చెందిన 100 మందికిపైగా ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.

మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన నాయకులే ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేస్తూ ఉండడంతో ఆయన సమస్యల సుడిగుండంలో పడిపోయారు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన సింధ్‌ హౌస్‌లో ఉండగా పీటీఐకి చెందిన కొందరు శుక్రవారం అక్కడికెళ్లి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బయటకు వస్తే ప్రభుత్వం తమను అపహరిస్తుందని అసమ్మతి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీలే తమ ఎంపీలను కొనేస్తున్నాయంటూ అధికార పీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. 

పార్లమెంట్‌లో మొత్తం సభ్యులు 342 మంది కాగా అధికార పార్టీ బలం 155, మరో 23 మంది మద్దతిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఇమ్రాన్‌ ప్రభుత్వానికి మొత్తం 172 మంది సభ్యుల మద్దతు అవసరం. సొంత పార్టీలో సభ్యుల తిరుగుబాటుతో ఇమ్రాన్‌ ప్రభుత్వం గండం గట్టెక్కడం కష్టంగా మారనుందని పరిశీలకులు అంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement