
ట్రయల్ రన్ విజయవంతం
బంజారాహిల్స్: వాకర్ల వాహనాల పార్కింగ్ సమస్యకు మరో పది రోజుల్లో శాశ్వత పరిష్కారం లభించనుంది. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కును ఆనుకుని మల్టీలెవల్ పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. వారం రోజులుగా జరుగుతున్న ట్రయల్ రన్ విజయవంతమైంది. ఆరు అంతస్తుల్లో 72 కార్లు పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. వారం రోజుల నుంచి పార్కు వాకర్స్ తమ కార్లను ట్రయల్ రన్‌లో భాగంగా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లో అధికారికంగా ఇది అందుబాటులోకి రానుంది. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, అవి పూర్తయ్యాక ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. నవ నిర్మాణ్ అసోసియేట్స్ సంస్థ రూ.6.50 కోట్ల వ్యయంతో నగరంలోని మొదటి మల్టీలెవల్ పార్కింగ్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది. ఈ పార్కింగ్ వ్యవస్థ విజయవంతమైతే కేబీఆర్ చుట్టూ మరో రెండు ప్రాంతాల్లో నిర్మించాలని యోచిస్తున్నారు.