బర్షత్‌ ఖాన్‌ ‘బకాయి’ రూ.25 కోట్లు! | - | Sakshi
Sakshi News home page

బర్షత్‌ ఖాన్‌ ‘బకాయి’ రూ.25 కోట్లు!

May 17 2025 7:13 AM | Updated on May 17 2025 7:13 AM

బర్షత్‌ ఖాన్‌ ‘బకాయి’ రూ.25 కోట్లు!

బర్షత్‌ ఖాన్‌ ‘బకాయి’ రూ.25 కోట్లు!

సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌ కేంద్రంగా వ్యవస్థీకృతంగా సాగిన లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసుపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అహ్మదాబాద్‌ యూనిట్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్‌ వ్యాపారి బర్షత్‌ ఖాన్‌ ఎగవేసిన కస్టమ్స్‌ సుంకం రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తక్షణం రూ.7 కోట్లు చెల్లించాలంటూ ఆదేశించగా... రూ.కోటి కట్టిన బర్షత్‌ మరో రూ.50 లక్షలు చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్‌ కోర్టులో గురువారం బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలంటూ డీఆర్‌ఐ అధికారులు చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. మరోపక్క ఈ లగ్జరీ కార్లను ఖరీదు చేసిన వారిలో ఇద్దరు హైదరాబాదీలను అహ్మదాబాద్‌ డీఆర్‌ఐ యూనిట్‌ గుర్తించింది. వీరి నుంచి వివరాలు సేకరించేందుకు శుక్రవారం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌ చేరుకుంది. విజయ్‌నగర్‌ కాలనీలోని మధ్య తరగతి కుటుంబానికి చెందిన బర్షత్‌ అహ్మద్‌ ఖాన్‌ గచ్చిబౌలిలోని డైమండ్‌ హిల్స్‌లో 2008 నుంచి ఎస్‌కే కార్‌ లాంజ్‌ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడి సోదరుడికి రెండు వర్క్‌షాప్స్‌ ఉండటంతో బర్షత్‌ సైతం ఈ రంగంలోకి వచ్చాడు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులతో పాటు బడా బిల్డర్లు, కాంట్రాక్టులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న బర్షత్‌ పదేళ్లలోనే గణనీయమైన స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం క్‌లైవ్‌ ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఏకే కార్‌ లాంజ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బీఏకే కార్‌ లాంజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతడి కార్‌ లాంజ్‌ నుంచి ఖరీదైన లగ్జరీ కార్లను ఖరీదు చేసే వారిలోనూ వీళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. బర్షత్‌ కస్టమర్లలో అత్యధికులు పన్ను ఎగ్గొట్టడానికి చెల్లింపులన్నీ నగదు రూపంలోనే చేసినట్లు డీఆర్‌ఐ అనుమానిస్తోంది. గడిచిన కొన్నేళ్లల్లో అమెరికా, జపాన్‌లోని హమ్మర్‌ ఈవీ, కాడిలాక్‌ ఎస్కలేడ్‌, రోల్స్‌ రాయిస్‌, లెక్సస్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌, లింకన్‌ నేవిగేటర్‌ తదితర కంపెనీలకు చెందిన 30 కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు డీఆర్‌ఐ గుర్తించింది. ఈ వాహనాలను హైదరాబాద్‌, పుణే, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీల్లో బడా వ్యాపారులు, రియల్టర్లకు విక్రయించారని అధికారులు ఆధారాలు సేకరించారు. దాదాపు పది కార్లు హైదరాబాదీలకే అమ్మినట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్తున్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించిన డీఆర్‌ఐ మిగిలిన వారి కోసం ఆరా తీస్తోంది.

లగ్జరీ కార్ల స్మగ్లర్‌ లెక్కలు తేలుస్తున్న అహ్మదాబాద్‌ డీఆర్‌ఐ

తక్షణం రూ.ఏడు కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు

రూ.కోటి చెల్లించి బెయిల్‌కు దరఖాస్తు

హైదరాబాద్‌ చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం

నగరానికి చెందిన ఇద్దరు కార్ల కొనుగోలుదారుల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement