మూడోసారి సీఎంగా కేసీఆర్‌ ఖాయం

- - Sakshi

కుత్బుల్లాపూర్‌ రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌

చింతల్‌/సుభాష్‌నగర్‌: తెలంగాణకు బ్రహ్మాండమైన సీఎం కేసీఆర్‌ ఉన్నారని, ఆయనకు ఎదురే లేదని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్‌ లో జరిగిన ప్రజా ఆశీర్వాద రోడ్‌ షోలో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలన్‌ హన్మంత్‌రెడ్డిలపై నిప్పులు చెరిగారు. మనందరికీ కేసిఆర్‌ మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉంటారని, మనందరికీ మంచి జరుగుతుందని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో 9 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా కులాల, మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టలేదని, ప్రాంతాల పేరు మీద పంచాయతీలు అంతకన్నా పెట్టలేదని అన్నారు. కడుపు నిండా సంక్షేమం, కళ్ల ముందే అభివృద్ధి కన్పిస్తోందన్నారు. బాలా నగర్‌ చౌరస్తానే కాదు ఏ గల్లీకి వెళ్లినా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కన్పిస్తున్నాయన్నారు. కొత్త రోడ్లు, 24 గంటలు నీళ్లు, నిరంతరం కరెంటు, పరిశ్రమల ఊపుతో అన్నిచోట్లా సమానమైన అభివృద్ధి ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ ఒక్కరిపైనా ఈగ వాలకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. మౌలిక వసతులు బాగా ఉన్నందునే హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడికి అనేకం వచ్చాయన్నారు. తెలంగాణలో స్థిరమైన నాయకత్వం, దమ్మున్న లీడర్‌ సీఎంగా ఉన్నందునే ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, సంపద పెరుగుతుందని, సంపదను సంక్షేమ రూపంలో పేదలకు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కుత్బుల్లాపూర్‌ లో కరెంటు, నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక వసతుల సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి మరోసారి వివేకానందను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి మరింత సాధ్యమవుతుందన్నారు. గతంలో మాదిరిగానే బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్‌ పాలన వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఈ రోడ్‌ షోలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రజలను ఉత్సాహ పరుస్తూ బీఆర్‌ఎస్‌ చేసిన పనుల్ని వారి చేతనే చెప్పించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top