
వివరాలు సేకరిస్తున్న ఏఎంఓహెచ్ భార్గవ నారాయణ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీవెంకాలు
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ మాసం సందర్భంగా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు ఐదు వేలపైకు పైగా మసీదులు ఉంటాయన్నది అంచనా. సాయంత్రం దీక్ష విరమించే ఇఫ్తార్ సమయంలో మంచి నీరు తప్పని సరి అవసరం ఉంటుంది. వేసవి కాలం కావడంతో మంచి నీటి వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన చోట ముందుస్తుగా ట్యాంకర్ల ద్వారా నీటి ని సరఫరా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. మసీదు కమిటీలు స్థానిక జలమండలి అధికారులను సంప్రదిస్తే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు మసీదులున్న ప్రాంతాల్లో ఎక్కడా సీవరేజి ఓవర్ ఫ్లో వంటి ఇబ్బందులు కాకుండా చర్యలు చేపట్టారు. ముందుస్తుగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం డివిజన్‌కొక మినీ జెట్టింగ్ మిషన్‌ను కేటాయించారు.
హోటల్ ఫుడ్ తిని 16 మందికి అస్వస్థత
సనత్‌నగర్: మాషా అల్లా హోటల్‌లో ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కోలుకోగా మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌లోని మాషా అల్లా హోటల్‌లో బుధవారం రాత్రి 16 మంది మటన్ మండీ తిన్నారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ శ్రీవెంకాలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్‌ను సీజ్ చేశారు.
● 12 మంది డిశ్చార్జి.. మరో నలుగురికి కొనసాగుతున్న చికిత్స
● హోటల్ సీజ్ చేసిన అధికారులు