‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్‌ చేయద్దు కన్ఫ్యూజన్‌లో ఎక్కువగా తినేస్తాం’.. రెండో స్థానంలో హైదరాబాద్‌

unhealthy snacks second place in hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్‌ చేయద్దు కన్ఫ్యూజన్‌లో ఎక్కువగా కొట్టేస్తా’ అంటాడో సినిమాలో హీరో. చుట్టూ హ్యాపీనెస్‌ ఉండాలి.. ఉంటే ఎక్కువ తినేస్తాం అంటున్నారు నగరవాసులు. సిటిజనుల చిరుతిళ్ల సరదాకు హ్యాపీ మూడ్‌ ఒకింత ఊపునిస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. అలా హ్యాపీ–టేస్ట్‌లో మునిగి తేలుతున్న సిటిజనుల సంఖ్యలో దేశంలోనే మన హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని కూడా తేల్చింది.

మానసిక స్థితికి, తినే తిండికి మధ్య బలమైన సంబంధం ఉంది. నిజానికి ఒత్తిడి ఆకాశాన్నంటుతున్నప్పుడు, మానసిక స్థితి క్షీణిస్తున్నప్పుడు, ఆలోచనలు చిరుతిండి వైపు మళ్లుతాయనేది ఎప్పటి నుంచో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నదే. సంతోషంగా ఉన్నప్పుడు కూడా చిరుతిండి అధికం అవుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.

అభి‘రుచుల’తో భావోద్వేగాలు..
అంతర్జాతీయ సంతోష దినోత్సవం (మార్చి 20) సందర్భంగా మూడ్‌ అప్‌లిఫ్టర్‌’ పేరిట గోద్రెజ్‌ యుమ్మీజ్‌ నిర్వహించిన ది ఇండియా స్నాకింగ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 72 శాతం భారతీయులు తమ అభిరుచులను భావోద్వేగాలతో అనుసంధానిస్తున్నారు. తాము సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్‌ తీసుకుంటున్నారు. చిరుతిళ్లు మానసిక ఆనందపు స్థాయిని మరింత పెంచే సాధనంగా అత్యధికులు భావిస్తున్నారు. చిరుతిండిని వారి మానసిక స్థితితో అనుసంధానిస్తున్న వారిలో 70 శాతం స్నాక్స్‌ తిన్న తర్వాత మరింత సంతృప్తిగా, ఉత్సాహంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది.

తూర్పు భారతంలో ఎక్కువ..
ప్రాంతాలవారీగా పోల్చినప్పుడు, తూర్పు భారతంలో 75 శాతం మంది సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ అల్పాహారం తీసుకుంటారని నివేదిక తేల్చింది. ఇక పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల్లో ఇది 72, 67, 74 శాతాలుగా లెక్కగట్టారు. నగరాల వారీగా చూసినప్పుడు ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్‌, కోల్‌కతా ప్రజలు సంతోషాన్ని బట్టి ఎక్కువ స్నాక్స్‌ తినేస్తారు. ఈ విషయంలో ఢిల్లీ 81 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, చైన్నె, హైదరాబాద్‌లు ఒక్కొక్కటి 77 శాతం, కోల్‌కతా 75 శాతంతో టాప్‌లో ఉన్నాయి, ఈ నగరాల్లోని స్థానికులు స్నాక్స్‌ను మూడ్‌ అప్‌లిఫ్టర్‌లుగా భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అదే క్రమంలో ముంబై సగటు 68 శాతంగా అహ్మదాబాద్‌ 67 శాతం. దీని తర్వాత పుణె, బెంగళూరు 66, లక్నో 62, జైపూర్‌ 61 శాతాల చొప్పున ఉన్నాయి. నివేదికలో మరో విశేషం.. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్‌ తీసుకునేవారిలో మహిళలే కొంచెం అధికంగా ఉన్నారు. ఫుడ్‌– మూడ్‌ కనెక్షన్‌కు సంబంధించి 74 శాతం మహిళలు 70 శాతం పురుషులు ఉన్నారు.

అధికమైతే అనారోగ్యమే..
చిరుతిళ్లు అధికంగా తినడం అనారోగ్యకారకంగా మారుతుందని నగరానికి చెందిన ఫిజిషియన్‌ డా.రమేష్‌ చెప్పారు. సంతోషంగా లేదా కొంత ఒత్తిడిలో ఉన్నప్పుడు స్నాక్స్‌ తీసుకునే క్రమంలో పరిమితి తప్పే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని తద్వారా ఊబకాయం సహా పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు

సోషల్‌ మీడియా తోడుగా...
సంతోషాన్ని పంచుకోవడానికి తాము ప్రాధాన్యమిచ్చే వాటిలో సోషల్‌ మీడియా తొలి స్థానంలో ఉందని ఆధునికులు అంటున్నారు. యూగోవ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా స్నాప్‌ చాట్‌ ను తాము హ్యాపీ నెస్‌ షేరింగ్‌ వేదికగా ఎక్కువగా వినియోగిస్తామని 87 శాతం నెటిజనులు వెల్లడించారు..

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top