
ప్రభాకర్ పనేనా..?
కాలేజీలో చోరీపై అనుమానిస్తున్న రాచకొండ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ చోరీ వెనక ‘కాలేజీ దొంగ’ బత్తుల ప్రభాకర్ పాత్ర ఉందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అవకాశాన్ని కొట్టపారేయలేమని చెప్తున్న రాచకొండ పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంతరాష్ట్ర ఘరానా దొంగ గత నెల 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇళ్లతో పాటు కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసే ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో 86 కేసులు ఉన్నాయి. ప్రభాకర్ ఎస్కేప్‌పై అక్కడి దేవరపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇతగాడి కోసం ఏపీ పోలీసులు దాదాపు పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ప్రభాకర్ సుదీర్ఘకాలం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఖరీదైన నివాసాల్లో జీవించాడు. ఇక్కడ ఉన్న విద్యార్థులతో పాటు అనేక మందితో సన్నిహితంగా మెలిగాడు. కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని వరుసపెట్టి చోరీ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ వద్ద ఇతడి కదలికలు పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పోలీసులపై కాల్పులకు కూడా తెగపడ్డాడు. ఏపీలోనూ ఇతడిపై కేసులు ఉండటంతో పీటీ వారెంట్‌పై అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు. గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న ఇతగాడు నగరానికి వచ్చి మళ్లీ కాలేజీలను టార్గెట్ చేశాడా? అనే కోణంలో రాచకొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది.
ఫిబ్రవరిలో గచ్చిబౌలి ప్రాంతంలో అరెస్టు
గత నెల్లో పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్