హన్మకొండ చౌరస్తా : అసెంబ్లీలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించిన పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని తన కార్యాలయంలో ముఖ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రదర్శించిన తీరు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. గన్‌లా చూపిస్తూ చంపేస్తా అనేలా బెదిరించడం ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు కాదన్నారు. గూండా సంస్కృతి, అసెంబ్లీ గౌరవాన్ని తుంగలో తొక్కే చర్యగా అభివర్ణించారు. దళిత సమాజాన్ని అవమానించారని, దీనిని ఉపేక్షించకుండా కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొమ్ముల బాబు, గోవింద శ్వేత, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ


