● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కాశిబుగ్గ : పాలిటెక్నిక్ విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. దేశవిదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివచ్చారు. ముందుగా కలెక్టర్‌తోపాటు టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. కలెక్టరేట్‌లో కూడా ఈ కళాశాలకు చెందిన ఇంజనీర్లు ఉన్నారని వివరించారు. బీటెక్ చదివిన వారికంటే పాలిటెక్నిక్ చదివిన వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యకు అధిక ప్రాధాన్యం ఉందన్నారు. డిప్లొమా, ఇంజనీరింగ్ మధ్య తేడా లేదని, నైపుణ్యమే విజయానికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఈవీ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్ర భాకర్, సంగీత కళాశాల బృందం, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆనాటి జ్ఞాపకాల సందడి..
20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల పూర్వ విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి తీపి గుర్తులు, గురువులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దశాబ్దాల తర్వాత ప్రాణ స్నేహితులను కలుసుకోవడం మరుపురాని అనుభూతిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అప్పటి తరగతి గదుల్లోకి వెళ్లి సంబురాల్లో మునిగితేలారు. తమ కళాశాలను సరస్వతి అమ్మగా భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.


