హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం సీతారాములకు నాగవల్లి పత్రాలతో ఘనంగా అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, మన్యసూక్తవిధానంతో పూజలు జరిపి రాములవారి ఉత్సవ విగ్రహాన్ని కల్యాణరాముడిగా అలంకరించారు. శుక్రవారం శ్రీసీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రిటైర్డ్ డీజీ ఏఆర్టీవై రవిప్రసాద్, లలిత, రిటైర్డ్ జీఓసీ నందిరాజు శ్రీనివాసరావు, అనురాధరావు దంపతులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపద గిరిజన విజ్ఞానపీఠం డీన్ డాక్టర్ గడ్డం వెంకన్న పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


