సాక్షి, వరంగల్: వరంగల్ డివిజన్ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల తప్పుడు కేసుల్లో ఓ ఏసీపీ, సీఐ, ఎస్సై సస్పెన్షన్ వ్యవహారం మరువకముందే.. ఇప్పుడు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఎస్సై సురేశ్‌పై వేటు పడింది. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం, కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు విచారణలో తేలడంతో పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఆయనను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే ఠాణాలో పనిచేస్తున్న మరో ఎస్సై కూడా సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అలాగే, తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్, ఇంతేజార్‌గంజ్ ఠాణా పరిధిలోనూ ఒకరిద్దరు అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యంతోపాటు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇలా ఈ మూడు పోలీస్‌స్టేషన్లలో అవినీతి అధికారుల వైఖరి వివాదాస్పదమవుతోంది. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులే కట్టు తప్పుతుండడంతో ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కావాలని నమోదుచేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతోపాటు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన గొర్రెల దహనం కేసులో నిందితులను పట్టుకోవాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గతంలో డీజీపీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇదీ పోలీసువర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
వివాదాలు, సస్పెన్షన్లకు
కేరాఫ్ మిల్స్‌కాలనీ పోలీసులు..
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ ఇటీవల వరుస వివాదాలు, అధికారుల సస్పెన్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సీఐ వెంకటరత్నం గతేడాది మే నెలలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఒక భూవివాదంలో నిందితులకు సహకరిస్తూ, తొమ్మిదేళ్ల క్రితమే మరణించిన వ్యక్తిపై తప్పుడు కేసు నమోదు చేయడం అప్పట్లో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే, ఒక హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనపై వేటు పడింది. అలాగే, ఎస్సై శ్రీకాంత్‌పై గతేడాది ఆగస్టులో అట్రాసిటి కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఒక దళిత మహిళపై దాడి చేసిన ఆరోపణలతో ఎస్సై, కానిస్టేబుల్ రాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదైంది. సీఐ వెంకటరత్నం కంటే ముందు పనిచేసిన రమేశ్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఎస్సై సురేశ్‌పై వేటు, మరో ఎస్సై సివిల్ వివాదాల్లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత సీఐ రమేశ్ ఠాణా విభాగాధికారిగా పనితీరుపై సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇక్కడ అధికారులపై స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, దానికి తలొగ్గిన అధికారులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. ఒకప్పుడు నేర నియంత్రణలో మంచి పేరున్న ఈస్టేషన్.. నెలల వ్యవధిలో అధికారులు సస్పెన్షన్ అవుతుండడంతో కమిషనరేట్‌కు కలంకంగా మారుతోందన్న చర్చ ఉంది. అలాగే, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్ ఠాణాల్లోనూ పోలీసులు వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే.
సస్పెన్షన్లకు కేరాఫ్‌గా
మిల్స్‌కాలనీ ఠాణా
కేసుల నమోదులో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఎస్సై సురేశ్‌పై వేటు
తప్పుడు కేసుల్లో మట్టెవాడ పీఎస్‌కు మరక.. ఇంతేజార్‌గంజ్‌లోనూ చేతివాటం
ఉన్నతాధికారుల చర్యలతో
అవినీతి ఖాకీల్లో గుబులు


