దళిత యువతకు పథకాలు | - | Sakshi
Sakshi News home page

దళిత యువతకు పథకాలు

Mar 27 2026 9:55 AM | Updated on Mar 27 2026 9:55 AM

న్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళిత యువతకు ఫేజ్‌–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు వరంగల్‌ జిల్లా కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్‌పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్‌, సెరిక ల్చర్‌, పట్టు పరిశ్రమ చౌకీ కేంద్రం, కిసాన్‌నర్సరీ, ఆయిల్‌పామ్‌, కూరగాయల పందిరి, పాడిగేదెల పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు హనుమకొండ సుబేదారిలోని తుషారా స్కూల్‌ ఎదురుగా ఉన్న కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.

భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి

న్యూశాయంపేట: దేవాదుల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపుహాల్‌లో జె.చొక్కారావు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు భూసేకరణ పురోగతిపై గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. నర్సంపేట, దుగ్గొండి, రాయపర్తి, వర్ధన్నపేట, నల్లబెల్లి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధం చేసి ముందస్తు నివేదికలు సమర్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జి.సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

వర్ధన్నపేటలో విషాదం

మామునూరు : వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గొల్లపల్లి భాగ్యలక్ష్మి, కిషన్‌ దంపతుల కుమారుడు అరుణ్‌(26) వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే బైక్‌పై బుధవారం రాత్రి వర్ధన్నపేట నుంచి వరంగల్‌ బయలుదేరాడు. ఈక్రమంలో పున్నేల్‌ క్రాస్‌ దాటగానే పార్కింగ్‌ లైట్లు వేయకుండా రోడ్డుపై లారీని నిలిపి డ్రైవర్‌ వెళ్లిపోయాడు. చీకట్లో కనిపించక బైక్‌.. లారీని ఢీకొంది. దీంతో అరుణ్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న మామునూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మృతుడి బంధువు శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

కొనసాగుతున్న లెప్రసీ సర్వే

వరంగల్‌ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఇంటింటి లెప్రసీ సర్వే విజయవంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్‌ మదన్‌మోహన్‌రావు తెలిపారు. జిల్లాలోని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి లెప్రసీ సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరికై నా శరీరంపై స్పర్శ లేని తెల్లని, ఎర్రని మచ్చలుంటే మీ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తకు చూపించాలని సూచించారు. ఆ మచ్చలు వ్యాధికి సంబంధించినవే అయితే ఉచితంగా చికిత్స ఇస్తామన్నారు. ఈసర్వేలో జిల్లా హెచ్‌ఈఓ సందెల శ్రీనివాస్‌, హెచ్‌ఓ శివ, ఏఎన్‌ఎం సంధ్య, ఆశాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బేగం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement