హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల్లోపు కార్యాలయాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నుల వసూలు సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవాని, తదితరులు పాల్గొన్నారు.
పన్నులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేయండి
హసన్‌పర్తి: పన్నులు చెల్లించకుండా మొండికేస్తున్నవారి ఆస్తులు జప్తు చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం కలెక్టర్ 1వ, 66వ డివిజన్లలో పర్యటించారు. ఈసందర్భంగా వార్డు కార్యాలయం, పబ్లిక్ టాయిలెట్స్‌తో పాటు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో యథావిధిగా విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎర్రగట్టుపల్లి, రాజలింగం కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానిక కార్పొరేటర్ శివకుమార్ తెలిపారు. టైలర్స్ స్ట్రీట్‌లో రోడ్డు నిర్మాణానికి మరో రూ.30 లక్షలు మంజూరు చేయాలని కార్పొరేటర్ కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గురుమూర్తి శివకుమార్, అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్, బీజేపీ మండల అధ్యక్షుడు మారం తిరపతి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల రమేశ్, సీహెచ్‌ఓ రాజారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాషానాయక్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ పాల్గొన్నారు.


