టెన్షన్..టెన్షన్!
భూపాలపల్లి/కాళేశ్వరం: ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల అటవీ సరిహద్దుల్లో సాయుధ బలగాలు భారీగా మో హరించాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు దళాల కదలికలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతూ కూంబింగ్ చేపట్టారు. అనువణువునా తనిఖీలు, సోదాలతో మారుమూల గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో అనుమానితులు, కొత్త వ్యక్తులపై ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
అడవుల్లో అలజడి..
పలిమెల, మహాముత్తారం, భూపాలపల్లి సరిహద్దు మండలా ల్లోని సర్వాయిపేట నుంచి ఇతర ప్రాంతాల్లోని అటవీగ్రామాల్లో ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉన్నత స్థా యి నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు రంగంలోకి దిగడంతో ఉత్కంఠ నెలకొందని తెలుస్తోంది. అడవిలో మావోయిస్టుల కోసం అనువణువునా గాలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనా యకులు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇతర మావోయిస్టులు ఈ ప్రాంతంలో తలదాచుకున్నారనే సమాచారం పోలీసులకు అందడంతో అడవులను అష్టదిగ్భందం చేశారని తెలిసింది.
చెక్‌పోస్టుల ఏర్పాటు..
భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్, అడిషనల్ ఎస్పీ నరేశ్‌కుమార్‌ల నేతృత్వంలో జిల్లాలోని రాంపూర్, పెగడపల్లి, కమలా పూర్ క్రాస్‌రోడ్డు వద్ద మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశా రు. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం తదితర గ్రామాలు, అడవుల్లో క్షుణ్ణంగా సోదాలు జరుగుతున్నాయి. ప్రధాన ర హదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ములు గు జిల్లాకు వచ్చిపోయే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరిస్తూ అడవి లోపలికి వెళ్లే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి ఏ క్షణంలో ఏమి జరుగుతుందో.. ఎలాంటి వార్తలు వినిపిస్తాయోనని ఆయా గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
నిఘా తీవ్రం!
పోలీసులు అటవీ పరిసర గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ మావోయిస్టులపై నజర్ వేస్తున్నారు. పోలీసు బలగాల మోహరింపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో అలజడి కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎ దురుకాల్పులు జరిగే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లితోపాటు ములుగులోని కొన్ని ప్రాంతాలు, గోదావరి, ఇంద్రావతి నదులు దాటి ఛత్తీస్ గఢ్ గుండా మావోయిస్టులు ప్రవేశించారని, రేషన్ సరుకుల కోసం మావోల కొరియర్లు తరలివచ్చి పోలీసులకు చిక్కారనే సమాచారం దావనంలాగా వ్యాపించింది. పోలీసులు ఓ పెద్ద తలను అదుపులోకి తీసుకొని లొంగుబాటుకు ప్రయత్నాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.
మరోవైపు ఎన్‌కౌంటర్?
ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దు అడవిలో ఎన్‌కౌంటర్ జరిగిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ స్పష్టమైన సమాచారం లేదు. ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నామని, మావోయిస్టులు ఎవరూ అదుపులో లేరని, ఎలాంటి ఎన్‌కౌంటర్లు జరగలేదని భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
అడవిలో భారీగా పోలీసు బలగాల మోహరింపు
మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు
మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, ఇతర మావోల కోసం ముమ్మర గాలింపు
అడవిలో ఏమి జరుగుతుందోనని ఆందోళన


