ప్రార్థన.. పఠనం | - | Sakshi
Sakshi News home page

ప్రార్థన.. పఠనం

Feb 19 2026 10:07 AM | Updated on Feb 19 2026 10:07 AM

ప్రార

ప్రార్థన.. పఠనం

న్యూశాయంపేట: క్రమశిక్షణ, దాతృత్వం ప్రార్థనల కలయికగా సాగే పవిత్ర మాసం రంజాన్‌. ఈ నెలలో ఖురాన్‌ పఠనం.. మసీదుల్లో తరావీ ప్రార్థనలతో వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆకాశంలో సన్నని రేఖలా మెరిసిన నెలవంక కోట్లాది మంది ముస్లింల హృదయాల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నింపింది. గురువారం నుంచి నెల రోజుల పాటు సాగే కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి నెలవంక దర్శనం పచ్చజెండా ఊపింది. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇస్లామిక్‌ కేలండర్‌లో అత్యంత పవిత్ర మైనదిగా భావించే రంజాన్‌ మాసం కేవలం ఆహార, పానీయాలను త్యజించడమే కాకుండా ఆత్మను ప్రక్షాళన చేసుకునే ఒక గొప్ప అవకాశం అందించింది. సూర్యోదయానికి ముందే సహర్‌తో మొదలై, సూర్యాస్తమయం ఇఫ్తార్‌ వరకు చుక్కనీరు కూడా తీసుకోకుండా సాగే ఉపవాసదీక్షలు మానవుడిలో సహనం, నిగ్రహాన్ని పరీక్షిస్తాయి. ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో నిలబడి ప్రార్థనలు చేయడం, తమ సంపాదనలో కొంత భాగం అభాగ్యులకు పంచి ఇవ్వడం(జకాత్‌) ఈ మాసం విశిష్టత.

హలీం, హరీస్‌తో పాటు

సూప్‌(గంజి) ప్రత్యేకం

ఉపవాస దీక్ష విరమించిన తర్వాత కడుపుకు హాయినిచ్చేలా తక్షణ శక్తిని అందించే బియ్యం, పెసర పప్పుతో చేసే ప్రత్యేక సూప్‌(గంజి) అందిస్తారు. అంతేకాకుండా రవ్వ, నెయ్యి, జీడిపప్పు, గరం మసాలాతో సుమారు 8 నుంచి 10 గంటల పాటు ఉడికించిన చికెన్‌, మేక మాంసంతో తయారు చేసిన హలీం, హరీస్‌లు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. శాఖాహారులకు వెజ్‌ హలీం కూడా లభిస్తుంది.

ఇఫ్తార్‌ విందులు ప్రత్యేకం..

రంజాన్‌ మాసంలో సాయంత్రం ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఐక్యత వాతావరణం కనిపిస్తుంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా, గ్రేటర్‌ వరంగల్‌ త్రినగరిలో సామూహిక ఇఫ్తార్‌లతో మసీద్‌లు, హోటళ్లు కళకళలాడుతుంటాయి. వందలాది మంది ఒకే చోట కూర్చోని ఇఫ్తార్‌లు చేస్తారు. ఖర్జూరాలు, రకరకాల పండ్లు, మజ్జిగ, గంజి తదితర వాటితో ఇఫ్తార్‌లు అందజేస్తారు. హిందూ, ముస్లిం సోదరభావానికి గంగా జమునా తహెజీబ్‌ ప్రతీకగా రాజకీయ నాయకులు, వ్యాపారులు ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అన్ని కుల, మతాల వారు కలిసి పాల్గొంటారు.

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకోవడాన్ని సహర్‌ అని, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని ఖర్జూర పండు లేదా నీటితో విరమించడాన్ని ఇఫ్తార్‌ అని పిలుస్తారు. దీక్షలు ప్రారంభించాక మంచినీళ్లు కూడా తాగకుండా దైవ చింతనతో కఠిన నియమాలు పాటిస్తారు. ఐదుపూటల నమాజ్‌తో పాటు రాత్రి వేళల్లో తరావీహీ అనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉపవాసం అంటే కేవలం కడుపును ఖాళీగా ఉంచడం కాకుండా అది కళ్లు, చెవులు, నాలుక, మనసును చెడుకు దూరంగా ఉంచడం.

ఉపవాసం..ఆరోగ్య ప్రయోజనాలు

ఉపవాసం కేవలం ఆధ్యాత్మికమే కాదు. శారీరక శుద్ధికి ఎంతో మేలు చేస్తుంది. రోజంతా ఏమి తినకపోవడం వల్ల శరీరంలోని విష తుల్యాలు (డిటాక్సీఫికేషన్‌) తొలగిపోయి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మెదడులో చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. కొలెస్ట్రాలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. సరైన పద్ధతిలో ఉపవాసం చేయడంతో శరీరంలోని కొవ్వులు కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

ప్రారంభమైన పవిత్ర రంజాన్‌ మాసం

ఆకాశంలో కనిపించిన నెలవంక

నేటి నుంచి నెలరోజులపాటు

ముస్లింల కఠిన ఉపవాస దీక్షలు

ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైన మసీదులు

ప్రార్థన.. పఠనం 1
1/1

ప్రార్థన.. పఠనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement