రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న వరంగల్ కలెక్టర్
న్యూశాయంపేట: ఎన్నికల నిర్వహణలో ఓటర్లకు అవగాహన, కార్యక్రమాల శిక్షణ సామర్థ్యాభివృద్ధి రంగంలో చేసిన ఉత్తమ కృషికి వరంగల్ జిల్లాకు విశిష్ట గౌరవం దక్కింది. ఈ మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డును వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అందుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ఈ గుర్తింపు లభించిందన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన వారందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు.
వరంగల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ కాశిబుగ్గ సాయిగణేశ్ నగర్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి.. బియ్యపు గింజపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందు వినాయక చవితి సందర్భంగా శనగపప్పు దినుసుపై వినాయకుడి ప్రతిమ, శ్రీరామనవమి సందర్భంగా పల్లి గింజపై శ్రీరాముడి ప్రతిమ, వివేకానందుడి జయంతి సందర్భంగా శనగపప్పు దినుసుపై వివేకానందుడి చిత్రం, తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా బియ్యపు గింజలతో తెలంగాణ పటాన్ని లింగమూర్తి తయారు చేశారు. గత వినాయక చవితికి పప్పు దినుసుపై వినాయకుడి ప్ర తిమను 39 సెకండ్లలో గీసి ఔరా అనిపించారు.
హన్మకొండ కల్చరల్: సమస్త జీవులకు సూర్యుడే ఆధారమని, సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయని శాస్త్రాల్లో పేర్కొనబడిందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం రథసప్తమి పూజలు నిర్వహించారు. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్‌కుమార్ ఉదయం నుంచి ప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామివారికి రుద్రాభిషేకం, భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం సూర్యభగవానుడి ఉత్సవమూర్తికి అభిషేకాలు, పల్లకీ సేవ నిర్వహించారు. వేలాదిమంది భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు రుద్రేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది మధుకర్, రజిత భక్తులకు సేవలందించారు.
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న వరంగల్ కలెక్టర్
రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న వరంగల్ కలెక్టర్


