వీరికి పదోన్నతి, బదిలీలు లేవు! | - | Sakshi
Sakshi News home page

వీరికి పదోన్నతి, బదిలీలు లేవు!

Jan 26 2026 6:53 AM | Updated on Jan 26 2026 6:53 AM

వీరికి పదోన్నతి, బదిలీలు లేవు!

వీరికి పదోన్నతి, బదిలీలు లేవు!

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం తమపై వివక్ష చూపుతోందని విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలో పనిచేస్తున్న అన్నిస్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులకు ఇన్‌చార్జ్‌ పదోన్నతి కల్పించిన యాజమాన్యం ఆర్టిజన్లపై సవతి తల్లి ప్రేమ చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిజన్లకు పదోన్నతి కల్పించడానికి ఎలాంటి అభ్యంతరాలు, వివాదాలు లేకున్నా యాజమాన్యం ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ఆయాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి వివాదాలు, కోర్టు కేసులున్నా.. ఇన్‌చార్జ్‌ పదోన్నతి కల్పించిన ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం ఎలాంటి వివాదాలకు తావులేని, గ్రేడ్‌ మార్పు ద్వారా పదోన్నతి కల్పించాలని స్టాండింగ్‌ రూల్స్‌ చెబుతున్నా పట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యమేంటని వారు నిలదీస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 17 సర్కిళ్లలో మొత్తం 4,678 మంది ఆర్టిజన్‌ ఉద్యోగులున్నారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేసిన పోరాటం ఫలితంగా గత ప్రభుత్వం 2017 జూలై 29న వీరిని సంస్థల్లోకి విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఆర్టిజన్లుగా గుర్తించింది. విద్యార్హతలను బట్టి నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. వీరిని సంస్థల్లోకి తీసుకున్నా.. రెగ్యులర్‌ ఉద్యోగులకు వర్తించే సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయడం లేదు. వీరి కోసం ప్రత్యేకంగా స్టాండింగ్‌ రూల్స్‌ ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ఈ స్టాండింగ్‌ రూల్స్‌లో ఆర్టిజన్లకు గ్రేడ్‌ మార్పు ద్వారా పదోన్నతి కల్పించాలని ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. గ్రేడ్‌–4 వారికి గ్రేడ్‌–3గా, గ్రేడ్‌–3 వారికి గ్రేడ్‌–2గా, గ్రేడ్‌–2 వారికి గ్రేడ్‌–1గా, గ్రేడ్‌–1 వారికి గ్రేడ్‌ వన్‌ ప్లస్‌గా పదోన్నతి కల్పించాల్సి ఉండగా ఏళ్లుగా యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆర్టిజన్లు వాపోతున్నారు. పదోన్నతి ఇవ్వకపోవడంతోపాటు బదిలీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నా తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, జీతాలు, హక్కుల్లోనూ అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమకు పదోన్నతి, బదిలీ అవకాశం కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు.

సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆర్టిజన్లు

రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు, బాధ్యతలు

స్టాండింగ్‌ రూల్స్‌ పట్టించుకోని ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement