మారిన ఎన్నికల స్వ‘రూపం’..
నోటే ఓటైంది..వ్యాపారంగా రాజకీయాలు
భూపాలపల్లి అర్బన్: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి పల్లెలు అభివృద్ధి చెంది పచ్చగా ఉన్నప్పుడే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. అయితే నోటుస్వామ్యం వర్ధిల్లుతున్న నేటి రోజుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. డబ్బులు, మద్యమే ఇప్పటి ఎన్నికలను శాసిస్తూ పల్లెల్లో అశాంతికి కారణమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు కులసంఘాలను కూడగడుతూ.. యువజన సంఘాలకు గాలం వేస్తూ.. మహిళా సంఘాలను మచ్చిక చేసుకుంటున్నారు. పార్టీ రహితంగా సాగాల్సిన గ్రామపంచాయతీ ఎన్నికలకు పార్టీల రంగులద్ది అభ్యర్థులు చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో విలువ ఉంది. అలాంటి ఓటును అమ్ముకునే, కొనుగోలు చేసే సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఇది నాటితరం సర్పంచులకు మనోవేదన కలిగిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి, రెండు విడతలు పూర్తికాగా బుధవారం మూడో విడత జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఎన్నికల తీరుపై నాటితరం సర్పంచుల మనోగతంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
గతంలో ఓటర్లు నమ్మకంగా ఉండేవారు. మాట మీద ఓటు వేసేవారు. గ్రామాభివృద్ధి జరిగేది. ఇప్పుడు రాజకీయాలు చూస్తే బాధ కలుగుతోంది. ఎన్నికల్లో ఖర్చుపెట్టడం, తిరిగి సంపాదించుకోవడమే లక్ష్యమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎన్నికల ప్రచార ఆర్భాటాలు.. గెలుపు కోసం అభ్యర్థులు పడే పాట్లు చూస్తే ఇబ్బందిగా ఉంది. ఓటర్ల తీరులోనూ మార్పు రావాలి. నేను 1988–1993 మధ్య చిట్యాల సర్పంచ్‌గా పని చేశా.
– బుర్ర నర్సయ్య, మాజీ సర్పంచ్, చిట్యాల
మాది భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం. 2001లో గ్రామ సర్పంచ్‌గా పనిచేశా. అప్పట్లో ప్రజలు మాట మీద ఉండే వారు. మేం ఏదైనా చెబితే గౌరవించే వారు. సర్పంచ్‌గా గుర్తింపు, గౌరవం ఉండేది. మా ఊరి అభివృద్ధికి అనేక పనులు చేశా. ఇప్పుడు డబ్బుల ప్రభావం ఎక్కువైంది. విలువలు పతనమయ్యాయి. నాటి గౌరవం, మర్యాద నేటి తరంలో కనిపించడం లేదు. రాజకీయం అర్థం మారిపోయింది. ఇప్పటి ఎన్నికల తీరు చూస్తే బాధగా ఉంది. డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఏదైనా పనిపడితే.. అడిగే హక్కు ఉంటుందా? అనే అనుమానం కలుగుతోంది.
– లావుడ్య దాసునాయక్, మాజీ సర్పంచ్, గొల్లబుద్దారం
ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు
నాటితరం సర్పంచుల మనోగతం
మారిన ఎన్నికల స్వ‘రూపం’..
మారిన ఎన్నికల స్వ‘రూపం’..


