ఎమ్మెల్సీ వర్గంలోకి నల్గొండ రమేష్
వరంగల్: వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొండా దంపతులకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నల్గొండ రమేష్ మరో వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గంలోకి చేరినట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పులో కొండా దంపతులు పార్టీ వ్యవహరాలతోపాటు ఇతర విషయాలు చక్కదిద్దే బాధ్యతలను ఒక నాయకుడికి అప్పగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ నాయకుడికి రమేష్‌కు పొసగక పోవడంతో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిసింది. ఈక్రమంలోనే రమేష్‌కు చెందిన నాయకుడిని పోలీసు కేసులు పెట్టించి కొట్టించడం వల్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన వర్గం వారికి ఏమైనా చేసేందుకు ప్రయత్నిస్తే అధికార వ్యవహరాలు చేస్తున్న నాయకుడి సూచనలతో అధికారులు వ్యతిరేకం కావడమే కాకుండా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన ఎమ్మెల్సీ వర్గం నాయకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే ఆ వర్గంలో ఎందుకు ఉండడం తమ వర్గంలోకి రావాలని సూచించడంతో పార్టీ కార్యక్రమాల్లో కొండ వర్గీయులతో కాకుండా ఎమ్మెల్సీ వర్గంతో పాల్గొంటున్నారు. దీనికి తోడుగా ఎమ్మెల్సీకి అత్యంత దగ్గరగా ఉన్న అయూబ్ డీసీసీ అధ్యక్షుడు కావడంతో మరింత ధైర్యంతో నల్గొండ రమేష్ ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అందువల్ల శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ సారయ్య తన వర్గంతో కలసి నల్గొండ రమేష్ ఇంటికి వెళ్లారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పార్టీ వాళ్లపై కేసులు పెట్టించే సంస్కృతి నెలకొందన్నారు. అందువల్ల ఎమ్మెల్సీ సారయ్యతో తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంటల రాజు, మాజీ నాయకులు తత్తర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సదరు నాయకుడి చర్యలతో తూర్పులోని మరిమంది నాయకులు సారయ్య వర్గంలోకి మారే అవకాశాలున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.


