పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి ఓకే..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో, యూనివర్సిటీ కాలేజీల్లో విద్యాబోధనకు పార్ట్‌టైం లెక్చరర్ల నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈమేరకు గురువారం సాయంత్రం కేయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హతలతోపాటు ఇంటర్వ్యూల ద్వారా రోస్టర్ ద్వారా పార్ట్‌టైం లెక్చరర్లను నియమించనున్నారు. ఏవిభాగంలోని ఆవిభాగం అధిపతి, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్, డీన్, ఇద్దరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌తో ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏదైనా కోర్సులో సబ్జెక్టులో గోల్డ్‌మెడల్‌కు ఎవరైనా తమపేరును పెట్టాలనుకుంటే ఇక నుంచి రూ.5 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది 2025–26 వరకు ఆయా కోర్సుల్లో డిటెన్షన్‌ను ఎత్తి వేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ పరిధి ఏ పీజీ కోర్సులోనైనా ఈవిద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో 15లోపు విద్యార్థులు ప్రవేశాల సంఖ్య ఉంటే.. వేరేచోటకు షిఫ్ట్ చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ల పదవులకు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ లభించింది. సుమారు 4:30 గంటలపాటు నిర్వహించిన ఈ కమిటీ సమావేశంలో వివిధ కోర్సుల సిలబస్‌లపై చర్చించారు. 35 అంశాలకుపైగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, వివిధ విభాగాల అధిపతులు, డీన్‌లు, ప్రిన్సిపాళ్లు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ పాల్గొన్నారు.
రూ.5 లక్షలిస్తే వారిపేరుపై గోల్డ్ మెడల్
ఫార్మసీ, బీటెక్ కోర్సుల్లో
డిటెన్షన్ ఎత్తివేత!
కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం


