రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలు జరగనున్న ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ఆయా మండలాల ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల ఎంపీడీఓలు, నోడల్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల వారీగా సర్పంచ్, వార్డు స్థానాల బ్యాలెట్ పేపర్లను సరిగ్గా ఉన్నాయా లేదా? అని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల (డీఆర్‌సీ)లో గ్రామపంచాయతీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వారీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌సీలలో పోలింగ్ సిబ్బందికి సరిపోయేలా టేబుల్స్, కుర్చీలు, టెంట్లు వేయించాలన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్‌సీతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. ఈసందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్ ఏర్పాట్లపై ఎంపీడీఓలకు పలు సూచనలిచ్చారు. సమావేశంలో ఎంపీడీఓలు అనిల్ కుమార్, సుమనవాణి, నర్మద, లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
అధికారులతో టెలికాన్ఫరెన్స్
రెండో విడతకు పటిష్ట ఏర్పాట్లు


