నేడు తొలి సంగ్రామం
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో మొత్తం 69 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 64 గ్రామపంచాయతీల్లో నేడు (గురువారం) పోలింగ్ జరగనుంది. మొత్తం 658 వార్డుస్థానాల్లో 150 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన 505 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
1.30 లక్షల ఓటర్లు
తొలి విడత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1,30,734 ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 63,681 మంది కాగా, మహిళలు 67,052 మంది. ఒకరు ఇతరుల కేటగిరీకి చెందిన ఓటరు ఉన్నారు.
పటిష్ట ఏర్పాట్లు
ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,931 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 789 మంది పోలింగ్ ఆఫీసర్లు కాగా, 1,142 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు, ఎన్నికల పర్యవేక్షణ కోసం 65 మంది స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ సామగ్రి వంటి ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, తమ ఓటు హక్కును మధ్యాహ్నం ఒంటి గంటవరకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అనంతరం భోజన విరామం గంట.. తర్వాత బ్యాలెట్స్ లెక్కిస్తారు. బందోబస్తుకు సంబంధించి బలగాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలాయి. పోలింగ్ జరిగే గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఓటు హక్కుపై అవగాహన కల్పించామని, ప్రలోభాలకు లోనవ్వకుండా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరంగల్ జిల్లాలో..
సాక్షి, వరంగల్: జిల్లాలోని పర్వతగిరి, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో 80 సర్పంచ్ స్థానాలు, 585 వార్డులకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. వర్ధన్నపేట మండల పరిషత్ కార్యాలయం, రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పర్వతగిరి తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రిని ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు బుధవారం సాయంత్రం పీఓ, ఓపీఓలతో కూడిన బృందం పోలీసుల బందోబస్తుతో తరలించింది. మూడు మండలాల్లో 91 పంచాయతీలకు 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 80 స్థానాలకు 305 మంది సర్పంచ్ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 800 వార్డులకు 215 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 585 వార్డులకు 1,427 మంది పోటీలో ఉన్నారు.
వరంగల్ కలెక్టర్ సత్యశారద..
పర్వతగిరి, వర్ధన్నపేట పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించి అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు.
హనుమకొండ జిల్లాలోని మూడు మండలాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఓటు వేయనున్న 1.30 లక్షల ఓటర్లు
నేడు తొలి సంగ్రామం


