పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వద్దు
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: పన్ను బకాయిల వసూళ్ల లక్ష్యాలు చేరుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మేయర్ గుండు సుధారాణి రెవెన్యూ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో పన్ను వసూళ్లపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లతో కమిషనర్ చాహత్ పాల్గొని సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ వార్డు అధికారులు బిల్ కలెక్టర్ల వారీగా ఇప్పటి వరకు వసూలు చేసిన పన్ను వసూళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 31లోగా సూచించిన పన్ను వసూళ్లను చేరుకోవాలని ఆర్‌ఐలు, ఆర్‌ఓలు నిరంతరం క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లను పరిశీలించాలని పన్ను వసూళ్లకు సమాంతరంగా నీటి పన్ను వసూళ్ల చేయాలని బడా బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, చాలా వరకు నగరవాసులు నల్లా పన్నులు చెల్లించడం లేదని ఆస్తి పన్నులతో పాటుగా నల్లా పన్నులు చెల్లించి కార్పొరేషన్‌కు సహకరించాలని ఈసందర్భంగా మేయర్ నగర ప్రజలు కోరారు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ప్రసన్నరాణి, ఆర్‌ఓలు శ్రీనివాస్, షహజాదీ బేగం, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


